Mahabubnagar District: కిన్నెరసాని మాదిరిగానే అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నా బీఎన్ గుప్తా తులారం డ్యాం అభివృద్ధికి నోచుకోవడం లేదు. మహబూబాబాద్ జిల్లాకు సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ అప్పటి స్వాతంత్ర్య సమరయోధులు బీఎన్ గుప్తా చొరవ వల్ల ఆయన పేరు పెట్టారు. 2005 నుంచి బయ్యారం మండలంలోని పరిసర గ్రామాలకు ఈ డ్యాం ఎడమ కాలువ ద్వారా సాగునీరు అందుతున్నది.
మరో 8 ఫీట్లు డ్యామ్ ఎత్తు పెంచితే అటు బయ్యారం మండలానికి రెండో పంటతో పాటు మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి, రెడ్యాల, నడివాడ, గడ్డిగూడెం, జమాండ్లపల్లి గ్రామాలతో పాటు పరిసర గ్రామాల రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు సాగునీరు సస్యశ్యామలంగా అందించేందుకు వీలు కలుగుతుంది.
బీఆర్ఎస్ హయాంలో నిర్లక్ష్యం :
నిపుణుల ఆధ్వర్యంలో నివేదిక సమర్పించినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2016లో స్థానిక రెడ్యాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి చొరవతో బీఎన్ గుప్తా ప్రాజెక్ట్ అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం ప్రత్యేకంగా పర్యవేక్షించింది. మహబూబాబాద్ నియోజకవర్గంలోని రైతులకు, పట్టణ ప్రజలకు సాగు, తాగునీరు అందుతుందని తలంచి సత్వరమే ఎస్టిమేషన్, సర్వే చేయాలని ప్రముఖ లోటస్ ఇంజినీరింగ్ సంస్థలకు అప్పగించారు.
ఆ సమయంలో సంబంధిత పనులు ముమ్మరంగా సాగుతున్నాయని చర్చ సైతం సాగింది. అయితే, అది ఎంతో కాలం సాగలేదు. అప్పటి ప్రభుత్వం అసలే పట్టించుకోలేదు. దీంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా డ్యాం అభివృద్ధికి నోచుకోలేదు. కాకతీయ రాజుల కాలంలో పురుడు పోసుకున్న తులారం ప్రాజెక్ట్, తర్వాత బీఎన్ గుప్తా చొరవతో కొంత అభివృద్ధి చేసుకుంది.
Also Read: Gold Rate Today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
ఇక్కడి నుంచి రెండు కాలువలను తీయించగలిగితే మహబూబాబాద్ నియోజకవర్గంతో పాటు ఇల్లందు నియోజకవర్గంలోని కొన్ని మండలాలకు పూర్తిగా రెండు పంటలు పండే విధంగా సాగునీరు అందుతుంది. ముఖ్యంగా కుడి కాలువ నిర్మాణానికి నోచుకుంటే నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాలకు సాగునీరుతో పాటు తాగునీరు అందించేందుకు వీలు ఉంటుంది. గతంలో ఎడమ కాలువకు మోక్షం కలిగిందే తప్ప, కుడి కాలువకు మోక్షం లభించలేదు.
డ్యాం హైట్ పెంచితే..
డ్యాం హైట్ 8 ఫీట్లు పెంచితే మహబూబాబాద్ మండలంలోని 10 నుంచి 15 గ్రామాలకు సాగునీరు అందేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుంది. రైతులు రెండు పంటలు పండించుకునేందుకు సాగునీరు లభ్యమవుతుంది. అంతేకాకుండా వేసవి వచ్చిందంటే మహబూబాబాద్ పట్టణ ప్రజలు ఒక్క మున్నేరు వాగుపైనే ఆధార పడాల్సిన దుస్థితి ఉంది. ఈ డ్యాం హైట్‌ను 8 ఫీట్లు పెంచినట్లయితే పట్టణ ప్రజల దాహార్తిని చిరకాలం తీర్చే కల్పతరువుగా మిగిలిపోతుంది. ఆనాడు కాకతీయ రాజులు తవ్వించిన చెరువుకు పురుడు పోసిన బీఎన్ గుప్తా ఒకరైతే, అదే ప్రాజెక్టును ఇప్పుడు మరింత అభివృద్ధి చేపడితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని ఘనత దక్కుతుంది.
నీరు ఎర్రగుంట చెరువుకు మళ్ళిస్తే పర్యాటక అభివృద్ధి:
ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదికన హైట్ పెంచి పునర్నిర్మాణం చేస్తే కంబాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఎర్రగుంట చెరువును పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక చేపట్టవచ్చు. ఈ చెరువు విస్తీర్ణం చాలా పెద్దది. ఇప్పటికే ఇక్కడ కాకతీయ రాజులు నిర్మించిన రాజరాజేశ్వరి దేవి ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయానికి తోడు ఎర్రగుంట చెరువును అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా చేసేందుకు అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇదే గనక జరిగితే ఇక్కడ బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయొచ్చు. దాంతో మహబూబాబాద్ జిల్లాకు మణిహారంగా కంబాలపల్లి ఎర్రకుంట చెరువు మారుతుందని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.
అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరా :
2023 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లాకు వచ్చిన సమయంలో బీఎన్ గుప్తా ప్రాజెక్టును మరింత అభివృద్ధి చేసి అక్కడి నుంచి కంబాలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రకుంట చెరువుకు నీటిని సరఫరా చేస్తే పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపాను. 2016 సమయంలోనే తాను లోటస్ కంపెనీ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి అప్పటి ప్రజాప్రతినిధుల బృందంతో ప్రాజెక్టును సందర్శించేందుకు కృషి చేశాను.
Also Read: Heavy Rains: అకాల వర్షం.. రైతన్నకు కష్టం
యుద్ధ ప్రాతిపదికన ఎస్టిమేషన్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించిన గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. బీఎన్ గుప్తా ప్రాజెక్టును ఎత్తు పెంచి కుడి కాలువ నిర్మాణం చేపడితే ఈ ప్రాంత ప్రజలందరికీ మంచినీటి సౌకర్యం, రైతులకు సాగునీటి సౌకర్యం లభించే వీలుంటుంది. ముఖ్యంగా కంబాలపల్లి, రెడ్యాల, నడివాడ, గడ్డిగూడెం, జమాండ్లపల్లి గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు సాగు, తాగు నీరు పుష్కలంగా లభిస్తుంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్ దీనిపై ప్రత్యేక కృషి చేసి నియోజకవర్గ ప్రజలకు మేలు చేయాలి.