Mahabubabd News: తెలంగాణకు చెందిన ఓ పాఠశాల పిల్లలు తమ తల్లిదండ్రులకు దిమ్మతిరిగే షాకిచ్చారు. ఈ షాక్ తో ఆ తల్లిదండ్రులు కోలుకున్నారో లేదో కానీ మొత్తం మీద ఆ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంతకు ఆ పిల్లలు, తమ తల్లిదండ్రులకు ఎటువంటి షాకిచ్చారో చూద్దాం.
ప్రస్తుతం పిల్లలు బడి నుండి వచ్చారో లేదో, అలా ఆటలాడుకొనే పిల్లలను మనం చూస్తూ ఉంటాం. కొందరు పిల్లలు అయితే సెల్ ఫోన్స్ పట్టుకొని తెగ నొక్కుతూ ఉంటారు. కానీ ఈ పిల్లల బాధ అది కాదు. ఇక్కడ అంతా రివర్స్. తమ తల్లిదండ్రులు తమను పట్టించుకోవాలని వినూత్న రీతిలో తమ ఆవేదన వెళ్ళగక్కారు. ప్రతి ఇంట్లో ఫోన్ వాడకం అధికమైంది. కొంతమంది తల్లిదండ్రులు ఫోన్ పట్టుకుంటే చాలు, పిల్లలను పట్టించుకోని వారు కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు పడే బాధ అంతా ఇంతా కాదు.
ఆ బాధను వ్యక్తపరిచి ఈ చిన్నారులు, తమ తల్లిదండ్రులకు బిగ్ షాకిచ్చారు. తమ ఆవేదనను ఉత్తరం రూపంలో ఆ పిల్లలు తమ తల్లిదండ్రులకు వివరించారు. నేను బాగా చదువుతున్న నాన్న.. ఇంట్లో మీరు అందరూ సెల్ ఫోన్ చూస్తూ నన్ను మరచిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ 5వ తరగతి విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఉత్తరాలు రాసి పోస్ట్ చేశారు. మా పాఠశాల ఎంతో బాగుంటుంది.. విద్య తో పాటు ఆటలు, పాటలు ఉంటాయి. ప్రయివేట్ పాఠశాలల కంటే ఎంతో ధీటుగా మా బడి ఉంటుంది. గ్రామం లోని తల్లిదండ్రులు అందరూ ఆలోచన చేసి మా బడికి పంపండని ఉత్తరాలు రాశారు.
ప్రాధమిక స్థాయి విద్యార్థులు వినూత్న ఆలోచన అటు విద్యార్థుల తల్లిదండ్రులను ఎంతోగాను ఆలోచింపజేసింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా లోని కురవి మండలం బలపాల గ్రామ మండల ప్రజా పరిషత్ ప్రాధమిక పాఠశాలల్లో చోటు చేసుకుంది. విద్యార్థుల ఉత్తరాలు విద్యావంతులను ఆలోచింపజేస్తున్నాయి. తమ తల్లిదండ్రులలో ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అపనమ్మకాన్ని పారద్రోలేందుకు చిన్నారులు చేపట్టిన ఈ కార్యక్రమం అందరి మన్ననలు పొందింది.
అందుకే తల్లిదండ్రులు.. తమ పిల్లలు బడి నుండి రాగానే, ఏం చదువుకున్నారు? ఏం హోం వర్క్ చేశారో ఖచ్చితంగా తనిఖీ చేయాలని, అప్పుడే విద్యార్థుల విద్యా సామర్థ్యం తెలుస్తుందని విద్యావేత్తలు అంటున్నారు. సెల్ ఫోన్ లకు బానిసలుగా మారకుండా, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేధావులు సూచిస్తున్నారు. మొత్తం మీద ఈ చిన్నారులు రాసిన లేఖ అంశం ఇప్పుడు వైరల్ గా మారింది.