Suryapet District: పోలీసులు ఎన్‌కౌంటర్ల పేరుతో మావోయిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలను హత్య చేయడాన్ని వామపక్షాలు, ప్రజా సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. ఈ చర్యలకు వ్యతిరేకంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సామాజిక ప్రజా సంఘాల కన్వీనర్ ఎల్. భద్రయ్య, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్, సీపీఎం జిల్లా నాయకులు మట్టిపల్లి సైదులు, సీపీఐ పట్టణ కార్యదర్శి భూర వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా మాట్లాడారు.
ఆపరేషన్ కగార్ బూటకం..
ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు నాయకులను, కార్యకర్తలను, ఆదివాసులను లక్ష్యంగా చేసుకొని చంపడాన్ని ప్రభుత్వాలు ఒక విధానంగా కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. ఈ విధంగా చేపట్టే కార్యక్రమాల్లో రాజ్యాంగ, చట్టపరమైన నియమాలను ప్రభుత్వం బుట్టదాఖలు చేస్తుందని విమర్శించారు. నవంబర్ 18న ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి ప్రాంతంలో సీపీఐ (మావోయిస్టు) నాయకుడు మడావి హిడ్మాతో సహా ఆరుగురిని, నవంబర్ 19న రంపచోడవరం ప్రాంతంలో మరో ఏడుగురిని ఎన్‌కౌంటర్ల పేరిట చంపివేశారని, ఈ ఎన్‌కౌంటర్లన్నీ బూటకమని పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కుల సంఘాలు ప్రకటించాయని వారు గుర్తు చేశారు.
Also Read: Suryapet District: సూర్యాపేట జిల్లాలో.. ఎస్సై వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య!
ఆపరేషన్ కగార్‌ను రద్దు చేయాలి
ఎన్‌కౌంటర్లను వెంటనే నిలిపివేసి, ఆపరేషన్ కగార్‌ను రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో అరెస్టు చేసినట్టు వార్తలు వస్తున్న మావోయిస్టు నాయకుడు తిప్పని తిరుపతి / దేవ్జీ సహా అరెస్టయిన వారందరినీ ఆలస్యం చేయకుండా కోర్టుకు అప్పగించాలి. దేశవ్యాప్తంగా ఎన్‌కౌంటర్ల పేరున జరిగే హత్యలను తక్షణమే ఆపి, శాంతి చర్చలు జరపాలి. ఆదివాసీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడానికి చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలి. ఆదివాసులను బలవంతంగా నిర్వాసితులను చేయకుండా, వారి హక్కులకు సంబంధించిన అటవీ హక్కుల చట్టం మరియు పీసా నిబంధనలు అమలు చేయాలి’అని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు గంట నాగయ్య, కునుకుంట్ల సైదులు, గుంజలూరి కోటయ్య, ఎస్‌కే కరీం, దేసోజు మధు, నల్లగొండ జిల్లా ఆదివాసీ పోరాట సంఘీభావ వేదిక కో-కన్వీనర్ రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Also Read: Suryapet SP: పోలీసులపై దాడి జరిగిన ఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్పీ నరసింహ

