Journalists Protest: భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల వినూత్న నిరసన
పట్టాలిచ్చి ఇళ్ల స్థలాలు చూపలేదని జాతీయ రహదారిపై పడుకొని నిరసన
భూపాలపల్లి, స్వేచ్ఛ: పట్టాలిచ్చి ఇళ్ల స్థలాలు చూపించడంలేదంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జర్నలిస్టులు వినూత్న నిరసన (Journalists Protest) చేపట్టారు. జాతీయ రహదారిపై పడుకుని నిరసన తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ముందు 37 మంది జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాడు నాలుగో రోజుకు చేరాయి. ఈ నిరాహార దీక్షలో భాగంగా 5 ఇంక్లైన్ ఆర్చ్ నుంచి డప్పు చప్పుళ్లతో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ‘‘పట్టాలిచ్చారు.. స్థలాలు ఇవ్వడం మరిచారు’ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు నడిచారు. ముందుగా జయశంకర్ సార్ విగ్రహం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి, జయశంకర్ విగ్రహానికి పట్టాలను ఇచ్చి నిరసన తెలిపారు.
Read Also- Cabinet Decisions: జీహెచ్ఎంసీలో మరికొన్ని ప్రాంతాల విలీనం.. కేబినెట్ కీలక నిర్ణయాలు
అధికారులు పట్టాలిచ్చి స్థలాలు ఇవ్వకుండా మొద్దు నిద్ర పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు తమ ఆవేదనను తెలియజేసేందుకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై పడుకొని నిరసన తెలిపారు. 2 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాలు వస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్నామని విచారం వ్యక్తం చేశారు. ఈ నిరసనకు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. జర్నలిస్టుల నిరసనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి ఇళ్ల పట్టాలను సమర్పించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి 37 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు చూపించాలన్నారు. లేదంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు నాయకులు, జిల్లాలో ఉన్న జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

