Jangaon District: రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన పథకం(Pradhan Mantri Dhan Dhanya Krishi Yojana Scheme) అమలులో దేశంలోనే జనగామ(Janagama) జిల్లాను ముందు వరుసలో ఉంచాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్(Rizwan Basha Sheikh) అధికారులను ఆదేశించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. శనివారం దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
రైతాంగానికి అనేక ప్రయోజనాలు
దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 100 జిల్లాలను ఎంపిక చేయగా, తెలంగాణ(Telangana) రాష్ట్రం నుంచి జనగామ జిల్లాకు ఈ అరుదైన అవకాశం దక్కింది. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇటీవల కేంద్ర ప్రభుత్వ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, జనగామ ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా కలెక్టర్, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి(MLA Dr. Palla Rajeshwar Reddy)తో కలిసి మాట్లాడుతూ.. ఈ పథకంలో భాగంగా జనగామ జిల్లాలోని రైతాంగానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు.
Also Read: Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ప్రకటన.. ట్రంప్‌కు మాత్రం కాదు.. మరి ఎవరికంటే?
దేశంలోనే మొదటి స్థానం..
వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీటిపారుదల సౌకర్యాల మెరుగు, రుణాల మంజూరులో సులభతరం, చేపలు, గొర్రెలు, కోళ్ల పెంపకానికి ప్రాధాన్యత, రైతులకు కావాల్సిన వనరుల సమకూర్చడం ఈ పథకం నూటికి నూరు శాతం విజయవంతం అయ్యేందుకు కృషి చేసి, దేశంలోనే మొదటి స్థానం పొందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు పిలుపునిచ్చారు. రైతాంగానికి ఈ పథకం ఉద్దేశాలను పూర్తిస్థాయిలో తెలియజేసి, వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చూడాలన్నారు. దేశంలోనే జనగామ(Janagama)కు దక్కిన ఈ అరుదైన అవకాశం ఈ ప్రాంత రైతాంగానికి అదృష్టమని పేర్కొన్నారు. రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న రైతు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు.
Also Read: Amazing Facts: ఒక నిముషం సమయంలో మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
