Swetcha Effect: విధులకు గైర్హాజరవుతూ, జీతం మాత్రం తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న హుజురాబాద్ మలేరియా సబ్ యూనిట్ అధికారి రాజేందర్ రాజుపై జిల్లా ఉన్నతాధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. విధి నిర్వహణలో ఆయన నిర్లక్ష్యంపై ‘స్వేచ్ఛ డైలీ న్యూస్’ పత్రికలో విధులకు డుమ్మా వేతనం పక్క విధుల పట్ల నిర్లక్ష్యం అనే కథనానికి స్పందించిన జిల్లా వైద్యాధికారి (DM&HO) ఆయనకు మెమో జారీ చేశారు.
Also Read: Sabarimala Gold Controversy: శబరిమలలో ‘బంగారం మిస్టరీ’.. ఎవరీ ఉన్నికృష్ణన్!
కథనంలో ఏముంది?
మలేరియా సబ్ యూనిట్ అధికారి రాజేందర్ రాజు తరచుగా సరైన కారణం లేకుండా విధులకు డుమ్మా కొడుతున్నారని, అయినప్పటికీ ప్రతినెలా ప్రభుత్వ వేతనం మాత్రం పొందుతున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ అంశంపైనే ‘స్వేచ్ఛ డైలీ న్యూస్’ పత్రిక ఇటీవల “విధులకు డుమ్మా వేతనం పక్క” అనే శీర్షికతో సవివరమైన కథనాన్ని ప్రచురించింది.
ఉన్నతాధికారుల స్పందన
ప్రజారోగ్యానికి కీలకమైన మలేరియా విభాగం అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై జిల్లా ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కథనంపై దృష్టి సారించిన జిల్లా వైద్యాధికారి (DM&HO) తక్షణమే స్పందించారు. రాజేందర్ రాజును వివరణ కోరుతూ మెమో జారీ చేశారు. విధులకు ఎందుకు గైర్హాజరయ్యారో కారణాలు తెలపాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను స్పష్టం చేయాలని మెమోలో ఆదేశించారు.
కఠిన చర్యలు తప్పవు: DM&HO
ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా వైద్య సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలిసింది. స్వేచ్ఛ పత్రిక కథనంపై జిల్లా వైద్యాధికారి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
