Parents Abandoned: నవమాసాలు మోసిన కన్నతల్లిని, ముద్దుగా పెంచిన తండ్రిని కన్న కొడుకే రోడ్డున పడేశాడు. కడదాకా తోడుగా ఉంటాడనుకుంటే, ఆస్తులు రాయించుకున్న తర్వాత వదిలేయడంతో, ఆ వృద్ధాప్యంలో నిస్సహాయ స్థితిలో అన్నమో రామచంద్ర అంటూ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వృద్ధ దంపతుల ఆవేదన ఇది. కన్నబిడ్డ తీరుతో కన్నీటిపర్యంతమవుతున్న ఆ దంపతులు చివరకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్(Police Station) మెట్లెక్కారు.
కొడుకు పేరున రిజిస్టేషన్..
హుజురాబాద్(Huzurabad) మండలం ఇప్పల్ నర్సింగాపూర్(Ippal Narsingapur) గ్రామానికి చెందిన గుర్రాల రాజిరెడ్డి(Gurrala Rajireddy), ప్రమీల(Pramila) (70 ఏళ్లు) దంపతులకు కూతురు, కొడుకు (మహేందర్‌రెడ్డి) ఉన్నారు. వారికి వివాహాలు జరిపించిన తర్వాత, తమకున్న ఆరెకరాల భూమిని పదేళ్ల క్రితమే కొడుకు గుర్రాల మహేందర్‌రెడ్డి పేరున రిజిస్ట్రేషన్ చేశారు. భూమి రిజిస్ట్రేషన్ అయిన కొత్తలో కొద్ది రోజులు సక్రమంగానే చూసుకున్న కొడుకు, కోడలు ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు.
Also Read: Telangana BJP: జూబ్లీహిల్స్ అభ్యర్థిపై తేల్చుకోలేకపోతున్న బీజేపీ.. ఇంకా టైం పట్టనుందా..!
పింఛన్‌తోనే కాలం వెళ్లదీత
ప్రస్తుతం నెలకు వస్తున్న రూ.2వేలు పింఛన్‌తోనే ఆ వృద్ధ దంపతులు కాలం వెళ్లదీస్తున్నారు. వయసు మీద పడటంతో ఆరోగ్యం కూడా సహకరించట్లేదు. అనారోగ్య సమస్యలతో ఉన్నామని, ఆసుపత్రికి తీసుకువెళ్లమని కొడుకు, కోడలిని అడిగితే, కనీసం స్పందించకపోగా, వేధింపులకు గురిచేస్తూ, బూతులు తిడుతున్నారని వారు కన్నీరుమున్నీరయ్యారు. ‘ఈ వయసులో మమ్మల్ని ఆదుకోవాల్సిన కన్నకొడుకే పట్టించుకోకపోవడం చాలా బాధగా ఉంది’ అంటూ ఆ దంపతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
కొడుకు, కోడలిని పిలిపించి, తమ బాగోగులు చూసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆ వృద్ధ దంపతులు పోలీసులను వేడుకున్నారు. ఈ విషయంలో స్పందించిన హుజురాబాద్ సీఐ కరుణాకర్(CI Karunakar), వృద్ధ దంపతుల కుమారుడిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, వారికి భరోసా కల్పించి, వారిని పోషించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కన్నతల్లిదండ్రులను పోషించడం ప్రతీ కొడుకు బాధ్యత, ధర్మం అని, మానవత్వపు విలువలు మరిచి ప్రవర్తించిన ఈ కొడుకు విషయంలో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు స్థానికులు పేర్కొంటున్నారు.
Also Read: Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మోగిన నగారా.. గెజిట్ రిలీజ్!
