Sathupalli: సత్తుపల్లి అర్బన్ పార్క్ పరిసరాల్లో అడవి దుప్పుల వేట జరిగినట్టు వెలుగు చూసిన సమాచారం ఖమ్మం జిల్లా అంతటా సంచలనం రేపుతోంది. వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత వహించే అటవీశాఖ విచారణ ప్రారంభించినప్పటికీ, దర్యాప్తు చేపట్టే విధానంలో పారదర్శకత కనిపించకపోవడంతో స్థానికులు తీవ్రంగా ఆగ్రహిస్తున్నారు. నీలాద్రి అర్బన్ పార్క్‌లో కొన్ని రోజుల క్రితం తుపాకులతో దుప్పులను వేటాడినట్టు వచ్చిన వార్తలతో అటవీశాఖ అలెర్ట్ అయింది. డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్, ఎఫ్‌డీవో మంజుల పర్యవేక్షణలో విచారణ కొనసాగుతుండగా, వేటగాళ్లకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ ఉద్యోగి గోపికృష్ణ, అతని స్నేహితుడు రాంప్రసాద్‌లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టుకు హాజరుపరిచిన ఇద్దరికీ ఈ నెల 12 వరకు రిమాండ్ విధించారు.
కొత్త అనుమానాలకు దారి
అయితే, వీరిపై చర్య తీసుకున్న విషయాన్ని అటవీశాఖ గోప్యంగా ఉంచడం కొత్త అనుమానాలకు దారి తీస్తోంది. “వీరే ప్రధాన నిందితులా? లేక కేవలం సహకరించిన వారేనా?” అన్న సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. వేట జరిగిన రాత్రి అర్బన్ పార్క్‌లోకి ‘వారాహి’ స్టిక్కర్ ఉన్న ఒక కారు ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్టు తెలిసింది. ఆ కారు ఎవరిది, అందులో ప్రయాణించినవారు ఎవరు, వేట ఘటనతో వారికి సంబంధం ఉందా? వంటి విషయాలపై ఇప్పటివరకు అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. సీసీ కెమెరా ఫుటేజీని గోప్యంగా ఉంచడం, దర్యాప్తు పురోగతిపై స్పష్టత లేకపోవడం స్థానికుల అనుమానాలను మరింతగా పెంచుతోంది.
Also Read: Google Maps: గూగుల్ మ్యాప్స్ లో అప్డేట్ అయిన ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసా?
మౌనంగా ఉండడం ఎందుకు?
వేట సమయంలో పార్క్ సిబ్బంది స్పందించకపోవడం, రాత్రివేళల్లో పార్క్‌లో జరుగుతున్న కార్యకలాపాలపై ఆరా తీసే ప్రయత్నం చేయకపోవడం కూడా విమర్శలకు గురవుతోంది. “పార్క్‌లో ఏం జరుగుతుందో చూడాల్సినవారు మౌనంగా ఉండడం ఎందుకు? ని” సత్తుపల్లి ప్రజానీకం మండిపడుతుంది.విధులకు హాజరుకాకుండా ఇతర పనుల్లో నిమగ్నమవుతున్నారన్న ఆరోపణలు అటవీశాఖ సిబ్బందిపై వినిపిస్తున్నాయి. అటవీశాఖ వైఖరి ప్రజల్లో అనుమానాలను మరింత బలపరుస్తోంది. నిందితుల వివరాలపై స్పష్టత లేకపోవడం, సీసీ కెమెరాల వీడియోలను బయటపెట్టకపోవడం, ఇద్దరినే నిందితులుగా పరిగణించడం వంటి అంశాలు దర్యాప్తు విశ్వసనీయతపై అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన వెనుక “పెద్దల ప్రమేయం ఉన్నట్లుంది” అనే ఊహాగానాలు స్థానికంగా చర్చనీయాంశమవుతున్నాయి.
దొంగ చేతికి తాళాలు ఇచ్చి దోచుకో అన్నట్టుగా అసలు నిందితులను దాచిపెట్టడం ఎందుకు?” అని ప్రజలు ఆగ్రహిస్తున్నారు. ఈ సందర్భంలో అటవీశాఖ పూర్తి స్థాయి పారదర్శకత ప్రదర్శించాలని పౌర సమాజం డిమాండ్ చేస్తోంది. వాస్తవ నిందితులు ఎవరు? వేట ఎలా జరిగింది? పార్క్ సిబ్బంది పాత్ర ఏంటి? సీసీ కెమెరా వివరాలు ఎందుకు బయటకు రావడం లేదు? అన్న అంశాలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలని ప్రజలు కోరుతున్నారు. వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత వహించే శాఖే ఇలా వ్యవహరిస్తే జీవవైవిధ్యం తీవ్ర ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
