Harish Rao: రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడగా, బావబామ్మర్దులు హరీశ్ రావు (సిద్దిపేట), కేటీఆర్ (సిరిసిల్ల) తమ ఇలాకాలలో తమ పట్టును నిరూపించుకున్నారు. అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, ఈ రెండు జిల్లాల స్థానిక ఎన్నికల్లో ‘కారు’ జోరు కొనసాగింది. సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్ వ్యూహం ఫలించగా, సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అద్భుతమైన మెజారిటీని సాధించింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది. మాజీ మంత్రి వ్యూహం ఫలించడంతో, ఇక్కడ బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించింది. 91 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, ఏకంగా 80 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఈ విజయంతో జిల్లాలో బీఆర్ఎస్ ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది. మరోవైపు, కాంగ్రెస్ ఐదు స్థానాల్లో గెలవగా, బీజేపీ కేవలం రెండు గ్రామపంచాయతీలకే పరిమితమైంది. ఈ విజయం బీఆర్ఎస్‌కు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నాంది అని హరీశ్ ప్రకటించారు. ఈ విజయంతో ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు.
సిరిసిల్లలో కోల్పోని పట్టు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనూ గులాబీ ప్రభంజనం సృష్టించింది. తంగళ్లపల్లి మండలంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మొత్తం 30 స్థానాలకు ఎన్నికలు జరగగా, బీఆర్ఎస్ ఏకంగా 20 స్థానాల్లో గెలుపొంది పట్టు నిలుపుకున్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యింది. రెండేళ్ల పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వంపై జనంలో ఉన్న వ్యతిరేకత ఈ సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. పదికి పైగా స్థానాల్లో కాంగ్రెస్ మూడవ స్థానంలో నిలవడం ప్రజల వ్యతిరేకతకు నిదర్శనమని గులాబీ నేతలు విమర్శిస్తున్నారు.
Also Read: Balakrishna: ‘అఖండ2’తో సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది
కదలని బండి!
ఇక, కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిరిసిల్లలో బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే అధిక నిధులు ఇస్తామని సంజయ్ చేసిన ప్రకటనను పల్లె ప్రజలు పట్టించుకోలేదు. 16 గ్రామాల్లో బీజేపీకి అభ్యర్థులు కూడా పోటీకి దొరక్కపోవడం గమనార్హం. మూడవ విడతలో ఈ నెల 17న జరుగనున్న ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల సర్పంచ్ ఎన్నికలపై తంగళ్లపల్లి మండలం ఫలితాల ప్రభావం బలంగా పడనుంది. బీఆర్ఎస్ శ్రేణులు వచ్చిన ఫలితాలతో జోష్‌లో ఉన్నారు. ఈ నాలుగు మండలాల్లో కూడా బీఆర్ఎస్ మద్దతుదారులు మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశాలు మెరుగుపడ్డాయి.
Also Read: Rahul Gandhi: ఓట్ చోరీ అతిపెద్ద దేశద్రోహ చర్య.. ఒక్కరిని కూడా వదలం: రాహుల్ గాంధీ

