Siddipet District: రాజకీయం అంటే ప్రజాసేవ, ప్రజల సమస్యల పట్ల స్పందించడం. కానీ తాను రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసం అబద్ధాలు ఆడడం, మోసాలు చేయడం ఏమిటని బిజెపి నేతలు నిలదీశారు. ప్రజ్ఞాపూర్ ఊర చెరువు వరదనీటి ముంపు వల్ల ఏర్పడిన గజ్వేల్ రాజకీయ వేడి బిజెపి(BJP), బీఆర్ఎస్(BRS) పార్టీల మధ్య మాటల యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రతాప్ రెడ్డి వెంచర్ వల్లే ప్రజ్ఞాపూర్ ముంపుకు గురవుతుందని ప్రధాన రహదారిపై వరదనీరు పారుతుందని బిజెపి నిరసన వ్యక్తం చేయగా ప్రతాపరెడ్డి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి ఇది బిజెపి నాయకుల స్వార్థ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రచారం అని ఆరోపించడం తెలిసిందే. సోమవారం బిజెపి పట్టణ పార్టీ అధ్యక్షులు మనోహర్ యాదవ్ నాయకులు గాడి పల్లి అనూఫ్ తదితరులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రతాపరెడ్డి ఏర్పాటుచేసిన ఇల్లీగల్ వెంచర్ వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని కరాకండిగా మరోసారి ప్రకటించారు.
రాజకీయాల కోసం..
కాలువలు పునరుద్ధరణకు నిధులు మంజూరైనా బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ పాలనలో ఎందుకు పూర్తి చేయలేదని మనోహర్ యాదవ్, అనూఫ్ ప్రశ్నించారు. వెంచర్ లో అమాయకులకు ప్లాట్లు అంటగట్టి మోసం చేసినట్టు పేర్కొన్నారు. ఇన్ని రోజుల తర్వాత ఎందుకు సదరు వెంచర్ ను క్రమబద్దీకరణ చేశారని ప్రశ్నించారు. ఇప్పటివరకు అందులో ఇండ్ల నిర్మాణం ఎందుకు జరుగుతలేదని నిలదీశారు. రాజకీయాల కోసం ఏదైనా చేస్తానని ప్రతాప్ రెడ్డి(Prathap Reddy) చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో కెసిఆర్(KCR) ను గజ్వేల్ లో ఓడించాలని హరీష్ రావు(Harish Rao) తనతో ఫోన్ లో మాట్లాడి ఆర్థిక సాయం చేస్తానని కూడా చెప్పినట్లు మాట్లాడారని, ఇటీవల అదంతా అబద్ధమని తాను రాజకీయంగా నిలదొక్కుకోవడం కోసమే అబద్దం చెప్పానని చెప్పుకోవడాన్ని ప్రజలు ఏ విధంగా సంబోధించాలో ఆయనే చెప్పాలన్నారు.
Also Read: CMRF Fraud: సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల గోల్‌మాల్ కేసు.. మరో ఇద్దరు అరెస్టు
ఆయన ఆ పార్టీలోకి రావడం..
తన స్వార్థ రాజకీయాల కోసం ఎన్ని అబద్దాలైన ఆడుతానని ఎంతమందినైనా మోసం చేస్తానని చెప్పకనే ప్రతాప్ చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. బిఆర్ఎస్(BRS) పార్టీని ప్రతాప్ రెడ్డి బ్రష్టు పట్టించారని ఆయన ఆ పార్టీలోకి రావడం వల్లే పార్టీకి పనిచేసిన ఉద్యమకారులంతా బయటకు వెళ్లిపోయారని పేర్కొన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి బూరుగుపల్లి మాజీ సర్పంచ్ అని గజ్వేల్ క్యాంప్ ఆఫీసులో పార్టీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమేంటని వారు ప్రశ్నించారు. అది క్యాంప్ ఆఫీస్ కాకుండా రియల్ బ్రోకర్ల అడ్డాగా మార్చారని ఆరోపించారు. విష్ణువర్ధన్ రెడ్డి వయసుకు విలువ ఇవ్వకుండా మాట్లాడుతున్నారని అదే పద్ధతి మేము అనుసరిస్తే గజ్వేల్ లో వారి పరిస్థితి మరో విధంగా ఉంటుందని హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు సుభాష్ చంద్రబోస్ తో పాటు బిజెపి నాయకులు వెంకటరెడ్డి, చారి, బలరాం తదితరులు పాల్గొన్నారు. కాగా బీఆర్ఎస్ పార్టీ ప్రజ్ఞాపూర్ గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మనోహర్ యాదవ్, అనూప్ బిజెపి నాయకులు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు.
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్కా వ్యూహం!.. మరో రెండు సర్వేలు?