Etela Rajender: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్‌లో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ హాజరై, ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. ఆనాటి కమలాపూర్, ఇప్పటి హుజురాబాద్ నియోజకవర్గం ప్రజల కమిట్‌మెంట్‌కు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులను గెలిపించిన హుజురాబాద్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని తూచా తప్పకుండా నెరవేర్చుతానని, గెలిచిన ప్రజాప్రతినిధులకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
Also Read: MP Etela Rajender: ఈ మట్టిలో పుట్టి పెరిగిన వాడిని.. ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ భావోద్వేగం..!
మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ విజయం
తనతో 25 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్న నాయకుల రుణం తనపై ఉందని, అందుకే ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో పాల్గొన్నానని చెప్పారు. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో తాను చేసిన సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, అక్కడ 100 శాతం మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ప్రజలే చెబుతున్నారని పేర్కొన్నారు. హుజురాబాద్‌లో ఈటెల తట్టెడు మట్టి కూడా తీయలేదని చెప్పేవారు మానసిక స్థితి సరిగా లేని వారేనని విమర్శించారు. ఇటీవలి భారీ వర్షాల సమయంలో నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామం కూడా వాగులు దాటి ఇబ్బందులు పడలేదని, ఇప్పటివరకు 22 బ్రిడ్జిలను నిర్మించామని వెల్లడించారు.
ప్రజల మధ్యే ఉంటానని స్పష్టం
ఉద్యమకారుడిగా ఉద్యమాల్లో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై, మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి పనుల్లో నిరంతరం పనిచేశానని తెలిపారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నా, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్యే ఉంటూ, గెలిచినవారైనా ఓడినవారైనా అందరినీ పట్టుకొని వారి బిడ్డలా పనిచేస్తున్నానని అన్నారు. తన కష్టకాలంలో ప్రజలే అండగా నిలిచారని, అందుకే ఎప్పటికీ ప్రజల మధ్యే ఉంటానని స్పష్టం చేశారు. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు, ఐదు మండలాల్లో జరగనున్న మండల పరిషత్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గుర్తుపైనే అభ్యర్థులను గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభా , సీనియర్ నాయకులు రాజయ్య, కార్పొరేటర్ శివన్న ,సంపత్ రావు, శ్రీరామ్ శ్యామ్, భారత్ గౌడ్ , శోభన్ బాబు, గౌతమ్ రెడ్డి, సతీష్, సంపత్, అరవింద్ పాల్గొన్నారు.
Also Read: Etela Rajender: తెలంగాణలో ఈ సంస్కృతిని అంతం చేయాలి: ఈటల రాజేందర్

