Bhimadevarapalli: అవసరానికి తీసుకున్న అప్పు తీర్చకుండా డబ్బులు అడిగితే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తూ భీమదేవరపల్లి(Bhimadevarapalli) మండలం ముల్కనూరులో అప్పుయిచ్చిన మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి(Suicide) పాల్పడింది. బాధితురాలు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం పన్నెండేండ్ల క్రితం దేవన్నపేటకు చెందిన యాదమ్మ(Yadamma) కొడుకు చంద్ర శేఖర్ నుంచి ముల్కనూరుకు చెందిన గుడికందుల రమేష్(Ramesh) అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చేందుకు రేపు, మాపు అంటూ వాయిదాలు పెట్టాడు.
నాలుగు నెలల నుంచి స్టేషన్ చుట్టూ
ఇదే విషయంపై పలుమార్లు పంచాయితీలు పెట్టిన రమేష్ వినిపించుకోలేదని, తమపైనే తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్(Police Station) పిలిపించి వేధించారని బాధితురాలు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ముల్కనూరు పీఎస్ లో ఫిర్యాదు చేసి నాలుగు నెలల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్న పోలీసులు పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 5న డబ్బులు చెల్లించేందుకు అగ్రిమెంట్ రాసిచ్చిన రమేష్ డబ్బులు ఇవ్వకపోగా బాధితుల పైనే ముల్కనూరు పీఎస్ లో ఫిర్యాదు చేశాడు.
మూడు రోజులుగా ముల్కనూరు ఎస్సై స్టేషన్ చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులు బెదిరింపులకు గురి చేయడంతో మనస్తాపంతో రమేష్ ఇంటి ఎదుట మా తల్లి యాదమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు. నిందితుడి ఇంటి ముందు బాధితుడి తరుపు బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: BC Reservation Bill: స్థానిక సమరానికి సర్కార్ ప్రిపరేషన్.. ఎన్నికల జాబితా కోరిన ఈసీ