Huzurabad News: మున్సిపల్ కమిషనర్‌పై బేడ బుడగ జంగాల కాలనీ పట్ల వివక్ష చూపడంతో పాటు, తమను దురుసుగా మాట్లాడి బెదిరించారని బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం నాడు స్థానిక ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. 40 ఏళ్లుగా కనీస వసతులు లేవు పట్టణంలోని 23వ వార్డులో నివసిస్తున్న బేడ బుడగ జంగాల కాలనీ గత 40 సంవత్సరాలుగా కనీస మౌలిక వసతులకు నోచుకోలేదని సిరిపాటి వేణు తెలిపారు. కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, మిషన్ భగీరథ పైప్‌లైన్లు, వీధిలైట్లు వంటి సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా భారీ వర్షాల సమయంలో ఇళ్లలోకి నీరు చేరి అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాలించిన ప్రజాప్రతినిధులు, అధికారులు తమ కాలనీని పూర్తిగా విస్మరించారని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ ఇన్చార్జి ఆదేశించినా కమిషనర్ నిర్లక్ష్యం
కాలనీ సమస్యను కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ బాబు దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన కాలనీని సందర్శించి, అభివృద్ధి పనుల కోసం వెంటనే ఎస్టిమేషన్ వేసి ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆరు నెలల క్రితం ఆదేశించారు. అయితే, కమిషనర్ ఇప్పటివరకు ఆ ఆదేశాలను అమలు చేయకపోవడం దారుణమని జన సంఘం నేతలు విమర్శించారు. మున్సిపాలిటీకి ఇటీవల మంజూరైన ₹15 కోట్ల అభివృద్ధి నిధులను తమ కాలనీకి కేటాయించకుండా కమిషనర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు. “జైల్లో పెట్టిస్తాను” అని బెదిరింపు అభివృద్ధి నిధుల గురించి కోరేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన జన సంఘం నాయకుల పట్ల మున్సిపల్ కమిషనర్ అత్యంత దురుసుగా ప్రవర్తించారని సిరిపాటి వేణు తెలిపారు. “మళ్లీ మున్సిపల్ కార్యాలయమునకు వస్తే మీ పైన పోలీస్ కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాను” అని బెదిరించారని, “గెట్ అవుట్” అని అవమానపరిచారని ఆయన వెల్లడించారు.
ధర్నా హెచ్చరిక
తమ పట్ల దురుసుగా ప్రవర్తించి, అవమానపరిచిన మున్సిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే డివిజనల్ అధికారి (ఆర్డీఓ) మరియు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని జన సంఘం నేతలు తెలిపారు. ఫిర్యాదు చేసి వారం రోజులు గడిచినా కమిషనర్‌పై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు విమర్శించారు. మున్సిపల్ కమిషనర్‌పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోకుంటే, త్వరలో మున్సిపల్ కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా చేస్తామని సిరిపాటి వేణు ఈ సందర్భంగా హెచ్చరించారు.
