8th Class Student Suicide: మత్తుకు చిత్తవుతున్న యువత నానాటికి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ వంటి మహా నగరాల్లో మత్తు పదార్థాల వినియోగం అధికంగా ఉంటుందని అంతా భావిస్తుంటారు. అయితే ఈ రోజుల్లో అది చిన్న చిన్న టౌన్స్ కు సైతం పాకాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతానికి చెందిన యువతీ యువకులు మత్తు మాయలో పడిపోతున్న వార్తలు ఇటీవల ఎక్కువయ్యాయి. అయితే ఓ స్కూల్ చిన్నారి మత్తు మందుకు బలైన ఘటన ఏపీలోని విశాఖలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే..
సింహాచలం సమీపంలోని శ్రీనివాస నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి విద్యార్థి సాయి లోకేష్ (Sai Lokesh) మత్తు మందుకు బలయ్యాడు. తల్లిదండ్రులు లేని సమయంలో మత్తుమందును పీల్చిన సాయి లోకేష్.. ఆపై ఉరివేసుకొని ప్రాణం తీసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బిడ్డ కోసం వారు పడుతున్న వేదన చూసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్కూల్లో అలవాటు
సాయి లోకేష్ విషయానికి వస్తే.. అతడు స్థానిక గోపాలపట్నం జడ్పీహెచ్ స్కూల్లో గత మూడు సంవత్సరాలుగా చదువుతున్నాడు. హైస్కూల్లో జాయిన్ అయినప్పటినుండి మరో ఐదుగురు స్కూలు విద్యార్థులతో కలిసి మత్తు మందును తీసుకోవడం ప్రారంభించాడు. అయితే తోటి విద్యార్థులే సాయి లోకేష్ కు మత్తు మందు అలవాటు చేసినట్లు బాలుడి తండ్రి ఆరోపించారు. ఈ విషయం తెలిసి అతడ్ని స్కూల్ మానిపించినట్లు చెప్పారు.
7 నెలలుగా మత్తుకు దూరం
గత ఏడు నెలలుగా సాయి లోకేష్ ని స్కూల్ కి పంపకుండా మత్తుమందుకి దూరంగా ఉంచుతూ కాపాడుకుంటున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. గత బుధవారం తల్లిదండ్రులు లేని సమయంలో మత్తుమందును సాయి లోకేష్ మత్తు మందు పీల్చాడు. ఈ క్రమంలో మానసికంగా ఎలాంటి సమస్య తలెత్తిందో ఏమో గానీ.. వెంటనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read: Chinna Jeeyar Swami: నెక్ట్స్ టార్గెట్ చిన్న జీయర్ స్వామి? చిలుకూరు పూజారి సంచలన నిజాలు
పోలీసులపై ఆరోపణలు
అయితే స్కూల్లో చాలామంది విద్యార్థులకు మత్తుమందు అలవాటు ఉందని అంటున్న సాయి లోకేష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ అబ్బాయిని కోల్పోయామని ఇంకా ఎవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని మృతుడి తల్లి కన్నీరు మున్నీరు అవుతోంది. ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని వారు కోరుతున్నారు. మరోవైపు అన్న దూరం కావడంతో సాయి లోకేష్ సోదరి విలపిస్తోంది. బాలుడికి పోస్ట్ మార్టం నిర్వహించి పోలీసులు చేతులు దులుపుకున్నారని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.