Virat Kohli paired With Rohit Sharma: టీ20 ప్రపంచకప్ 2024లో విరాట్ కోహ్లిని భారత ఓపెనర్‌గా చూడబోతున్నామా? అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఈ రన్‌మెషీన్ కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా మెగా టోర్నీలో టీమిండియా ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడనే ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే రోహిత్ శర్మతో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
కాగా టీ20 ప్రపంచకప్ 2022 తర్వాత రోహిత్‌తో పాటు కోహ్లి కూడా సుదీర్ఘకాలం పాటు టీమిండియా తరఫున బరిలోకి దిగలేదు. అయితే ఆ సిరీస్‌లో కోహ్లి తను రెగ్యులర్‌గా వచ్చే మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. మరోవైపు రోహిత్‌కు జోడీగా యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేశాడు.ఇదిలా ఉంటే యువ ఆటగాళ్లకు పెద్ద పీట వేసే క్రమంలో ప్రపంచకప్ 2024లో అసలు కోహ్లికి చోటే దక్కదంటూ గతంలో వార్తలు వచ్చాయి. అగార్కర్ ఈ మేరకు ప్రతిపాదనలు చేయగా రోహిత్ శర్మ వాటిని ఖండించాడని కోహ్లి జట్టులో ఉండాల్సిందేనని పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
Also Read:కేకేఆర్ టీమ్‌ని ఓదార్చిన షారుక్ ఖాన్
ఈ నేపథ్యంలో మరో కొత్త అంశం తెరమీదకు వచ్చింది. ఐసీసీ ఈవెంట్లో తన పాత్ర ఏమిటన్న విషయం మీద క్లారిటీ కావాలని కోహ్లి సెలక్షన్ కమిటీని అడిగినట్లు తెలుస్తోంది.గతవారం ముంబైలో జరిగిన సమావేశంలో రోహిత్, ద్రవిడ్, అగార్కర్ ఇందుకు సంబంధించి కోహ్లిని ఓపెనర్‌గా పంపాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారట. కాగా రాయల్ చాలెంజర్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లి ఇప్పటి వరకు ఐపీఎల్ 2024లో ఏడు మ్యాచ్‌లు ఆడి 361 రన్స్ చేశాడు. ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు.మరోవైపు ఇటీవల కాలంలో రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న యశస్వి జైస్వాల్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు రాజస్తాన్ తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడి 121 రన్స్ మాత్రమే చేశాడు.