Yash Dayal: లైంగిక దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ యశ్ దయాల్‌కు (Yash Dayal) తాత్కాలిక ఊరట దక్కింది. అరెస్ట్‌పై స్టే విధిస్తూ అలహాబాద్ హైకోర్టు మంగళవారం ఆదేశాలు ఇచ్చింది. ఓ యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న యశ్ దయాల్ ఎఫ్ఐఆర్‌ను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాడు. పరిశీలించిన న్యాయమూర్తులు సిద్ధార్థ వర్మా, అనిల్ కుమార్‌లతో కూడిన బెంచ్ అరెస్టుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దయాల్ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు, కౌంటర్ దాఖలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. కౌంటర్ దాఖలు చేయాలంటూ ఫిర్యాదు చేసిన మహిళకు కూడా నోటీసులు పంపించింది.
దయాల్ వాదన ఇదే
బీఎన్ఎస్‌లోని సెక్షన్ 69 కింద కేసు పెట్టాలంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి, మాట నెర్చకుండా మోసం చేసినట్టు నిరూపించాలని, కానీ, ఫిర్యాదులో పేర్కొన్న విషయాల ప్రకారం వారు ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో మాత్రమే ఉన్నారని యశ్ దయాల్ తరపు న్యాయవాది వాదించారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని, దయాల్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాకే ఎత్తుగడతో మధ్యవర్తిత్వ డిమాండ్లతో కేసు పెట్టినట్టు పేర్కొన్నారు. దయాల్ ఆమెకు ఆర్థిక సహాయం కూడా చేశాడని, దయాల్ ఎప్పుడూ ఆమెకు తప్పుడు హామీలు ఇవ్వలేదని వాదించారు. ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది, దయాల్ ఐదేళ్లుగా ఆమెను శారీరకంగా వాడుకున్నాడని, తన కుటుంబ సభ్యులకు కూడా బాధితురాలిని పరిచయం చేశాడని చెప్పారు. దీంతో, పెళ్లి చేసుకోబోతున్నాడని ఆమె భావించిందని, కానీ, మోసం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని ప్రభుత్వ లాయర్ పేర్కొన్నారు.
Read Also- TS High Court: సెలూన్‌కు పోలీసు ప్రొటెక్షన్
కోర్టు ఏమన్నదంటే?
ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా ఇద్దరూ ఐదేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, అయితే, పెళ్లి చేసుకుంటానని దయాల్ హామీ ఇచ్చింది నిజమా కాదా అన్నది ఇప్పుడే తేల్చడం కష్టమని అలహాబాబాద్ హైకోర్టు పేర్కొంది. ఈ విషయంలో ఇంకా విచారణ జరగాల్సిన అవసరం ఉందని, కాబట్టి, తదుపరి విచారణ వరకు లేదా పోలీస్ రిపోర్టు వచ్చే వరకు దయాల్‌ను అరెస్టు చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.
Read Also- Health: మంచి ఫుడ్ తిన్నా అనారోగ్యమేనా?, అయితే ఇది మీకోసమే!
అసలు ఈ కేసు ఏంటి?
క్రికెటర్ యశ్ దయాల్‌పై లైంగిక దోపిడీకి పాల్పడ్డాడంటూ జూలై 6న ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా ఇండిరాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. భారతీయ న్యాయ వ్యవస్థలోని సెక్షన్ 69 (బెదిరింపుల ద్వారా లైంగిక సంబంధం) కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఫిర్యాదుల విభాగానికి ఫోన్ చేసి ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, సీఎంవో ఆదేశాల మేరకు ఈ కేసు నమోదయింది. ‘‘యశ్ దయాల్ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఐదేళ్లుగా శారీరకంగా వాడుకుంటున్నాడు. చివరికి ఇతర మహిళలతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని నేను తెలుసుకున్నాను. దయాల్ నన్ను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, వాయిదా వేస్తూ వచ్చాడు. చివరికి వేరే మహిళలతో ఉన్నాడని తేలింది. మొదటగా జూన్ 21న సీఎం గ్రీవెన్స్ పోర్టల్ (IGRS) ద్వారా ఈ ఫిర్యాదు పంపాను ’’ అని ఫిర్యాదు చేసిన మహిళ చెబుతోంది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది.