MLA Gandra: అధికార బలంతో ఏదిబడితే అది చేస్తే ప్రజలు తిరగబడతారు. తగిన గుణపాఠం చెప్తారు. భూపాలపల్లిలో ఓ మహిళ చేసిన పని ఇందుకు అద్దం పడుతున్నది. తనకు అన్యాయం చేశారంటూ ఏకంగా ఎమ్మెల్యేకే ఝలక్ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
అసలేం జరిగిందంటే?
భూపాలపల్లి మంజు నగర్‌లో మహిళా రైతు ఓదెల లలిత ఉంటోంది. అక్కడ ఆమెకు చెందిన గేదెల షెడ్డును మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. దీనిపై సదరు మహిళ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తన గేదెల షెడ్డు కూల్చివేతకు గల కారణాలను అన్వేషించగా, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రోద్బలంతోనే ఇది జరిగిందని తెలుసుకుంది. దీంతో చిర్రెత్తుకొచ్చి ఎమ్మెల్యేకే షాకిచ్చే చర్యకు ఉపక్రమించింది.
క్యాంప్ ఆఫీస్‌కు గేదెలు
తన గేదెల షెడ్‌ను ఎమ్మెల్యే చెప్పడం వల్లే మున్సిపల్ అధికారులు కూల్చి వేశారని మహిళా రైతు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ వినూత్న నిరసన చేపట్టింది. తన షెడ్డును కూల్చివేయడంతో గేదెలు ఉంచేందుకు స్థలం లేక, ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వాటిని తీసుకొచ్చింది.
Read Also- Andaman: అండమాన్ ద్వీపంలో తొలిసారి అడుగుపెట్టిన ఈడీ.. రూ.200 కోట్ల కేసు..
సమస్య తేలే దాకా అక్కడే..
కుట్ర పూరితంగా తన షెడ్డును కూల్చినందుకు సమాధానం చెప్పాల్సిందేనని లలిత భీష్మించుకుని కూర్చుంది. సమస్య పరిష్కారం అయ్యే వరకు గేదెలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు క్యాంప్ కార్యాలయంలోనే ఉంటాయని తెగేసి చెప్పింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా చేరి నియోజకవర్గం దాటింది. రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మహిళా రైతు చేసిన పనిని చాలామంది మెచ్చుకుంటున్నారు. సరైన పని చేశావని మద్దతుగా నిలుస్తున్నారు.
Read Also- Vijay Deverakonda: ‘అన్నా మనం హిట్ కొట్టినం’ అంటుంటే.. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది..