Viral Video: బెంగళూరులోని నమ్మా మెట్రోలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వృద్ధుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ యువతి ఆరోపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిందితుడిని గురించి పోలీసులకు ఫిర్యాదు చేయడంలో యువతి చూపిన ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ ఘటన తన ఆఫీసు నుంచి ఇంటికి తిరిగివెళ్తున్న సమయంలో చోటుచేసుకుందని యువతి వీడియోలో వివరించింది. మెట్రోలో సీటు దొరకడంతో ఇద్దరు ప్రయాణికుల మధ్య కూర్చున్నానని, ప్రయాణం మధ్య వరకు అంతా సాధారణంగానే జరిగిందని తెలిపింది. అయితే, తన పక్కన కూర్చున్న ప్రయాణికుడు ఒక స్టేషన్‌లో దిగిపోయిన తర్వాత మరో వ్యక్తి వచ్చి కూర్చోవడంతో పరిస్థితి మారిందని చెప్పింది.
ఆ వ్యక్తి తనకు చాలా దగ్గరగా కూర్చుని అసౌకర్యానికి గురిచేశాడని యువతి ఆరోపించింది. మొదట అది పొరపాటున జరిగిందని భావించి తాను కొద్దిగా కదిలి కూర్చున్నానని, కానీ ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా తన కాళ్లను తాకడం మొదలుపెట్టాడని తెలిపింది. కదలమని చెప్పినా అతడు తన ప్రవర్తనను ఆపలేదని పేర్కొంది.
“కొద్ది సేపటికి అతని చేయి మళ్లీ నన్ను తాకింది. అప్పుడే ఇది తప్పిదం కాదు, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడని అర్థమైంది,” అని యువతి చెప్పింది. మొదట షాక్‌కు గురయ్యానని, కానీ తన గమ్యస్థానం దగ్గరపడుతున్నప్పుడు మౌనంగా ఉంటే ఈ వ్యక్తి మరెవరినైనా వేధించే అవకాశం ఉందని భావించి చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. తర్వాత ఆమె ఉప్పరపేట పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన డిసెంబర్ 23న సాయంత్రం 7 గంటల సమయంలో జరిగింది. అనుచిత ప్రవర్తన, లైంగిక వేధింపుల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Also Read: Shivaji Controversy: తొడలు కనబడుతున్నాయనే.. నన్ను చూస్తున్నారు.. శివాజీ వివాదంపై శ్రీరెడ్డి కౌంటర్
సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, నిందితుడి వయస్సు 45 ఏళ్ళు ఉన్నట్లు గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు పూర్తయ్యాక చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై మెట్రో భద్రతా సిబ్బంది స్పందించి ఇద్దరినీ మెట్రో కార్యాలయానికి తీసుకెళ్లారని, అక్కడే తాను పోలీసులను పిలవాలని గట్టిగా డిమాండ్ చేసినట్లు యువతి తెలిపింది.

