Water Falls: తెలంగాణ ప్రాంతంలో ఎన్నో జలపాతాలు ఉన్నాయి. వాటిలో అధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. ప్రకృతి ఒడిలో పరవసించాలనుకునే వాళ్లు వర్షాకాలంలో తెల్లటి నురగలు కక్కుతూ, ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాలను చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. వాటిలో ఒకటే గాయత్రి జలపాతం. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు అధికంగా ఆసక్తిని చూపిస్తుంటారు.
ఎక్కడ ఉన్నది?
గాయత్రి జలపాతం ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలంలోని తర్నాం ఖుర్ద్‌కు దగ్గరలో ఉంటుంది. గోదావరి నదికి ఉప నది అయిన కమేద్‌పై ఉండే ఈ ప్రాంతం పచ్చని అడవులతో కనిపిస్తుంది. 70 కిలోమీటర్ల ఎత్తుపై ఉన్న రాతికొండ నుంచి జాలువారే జలపాతం అందాలు చూసిన వారు మైమరిచిపోకుండా ఉండరు. దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రకృతి సిద్ధంగా ఇది ఏర్పడింది. కొండ కోనలు, వాగుల నుంచి బజార్ హత్పూర్, నేరడిగొండ, ఇచ్చోడ మండలాల అటవీ ప్రాంతాల గుట్టల పైనుంచి ప్రవహించే నీరు, గాయత్రి జలపాతం దగ్గర నురగలు కక్కుతూ జాలువారుతుంటుంది. దీనిని గాడిద గుండం, మొక్కుడు గుండం అని కూడా పిలుస్తారు. ఇది తెలంగాణలోనే అతి ఎత్తైన జలపాతం. దాదాపు 363 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి పడే జలదారల సవ్వడి వినసొంపుగా అనిపిస్తుంది. జలపాతం దగ్గరకు వెళ్తే, జమ్మూకాశ్మీర్‌లో మాదిరిగా మంచు కురుస్తున్న అనుభూతి కలుగుతుంది.
Read Also- Tollywood: 40 ఏళ్లు దాటిన తెలుగు హీరోతో పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. కొత్త జంట ఫొటోలివే
ఎలా వెళ్లాలి?
ఉరుకుల పరుగుల జీవనంలో ఉండే హైదరాబాద్ వాసులు వీకెండ్‌లో గాయత్రి జలపాతానికి ప్లాన్ చేసుకోవచ్చు. హైదరాబాద్‌కు ఇది 270 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నిర్మల్‌కు 38 కిలోమీటర్లు, ఆదిలాబాద్‌కు 59 కిలోమీటర్ల దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు కామారెడ్డి సైడ్ ఔటర్ దాటి వెళ్లాలి. రామాయంపేట దాటాక కామారెడ్డి వస్తుంది. అక్కడి నుంచి నిజామాబాద్ రోడ్డులో ముందుకు వెళ్తే డిచ్పల్లి వస్తుంది. అక్కడి నుంచి కుడివైపునకు తిరిగి ఆర్మూరు వెళ్లాలి. బాల్కొండ, సోయన్ గ్రామాలు దాటాక నిర్మల్ వస్తుంది. బాల్కొండ దాటాక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది. నిర్మల్ చేరుకున్నాక ఆదిలాబాద్ రూట్‌లో ముందుకు వెళ్లాలి. కిష్టాపూర్, నేరడిగొండ దాటాక ఇచ్చోడ వస్తుంది. అక్కడకు వెళ్లాక కుడివైపునకు తిరిగితే జామిడి, గిర్జం, చించోలి గ్రామాలు వస్తాయి. చుట్టూ పచ్చని పొలాల మధ్య రోడ్డు మార్గం ఆహ్లాదభరితంగా ఉంటుంది. కాస్త ముందుకు వెళ్లాక మంకాపూర్ గ్రామానికంటే ముందే తర్నాం ఖుర్ద్‌కు వెళ్లే రోడ్డు కుడివైపున కనిపిస్తుంది. ఆ దారిలో ముందుకు వెళ్తే తర్నాం ఖుర్ద్ గ్రామం వస్తుంది. అక్కడి నుంచి గాయత్రి జలపాతం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
సాహస క్రీడలకు అనుకూలం
గాయత్రి జలపాతం సాహస క్రీడలకు అనుకూలంగా ఉంటుంది. నేరెడిగొండ నుంచి జస్నాపూర్ చేరుకుంటే అక్కడ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇది వాటర్ ఫాల్స్ కుడి వైపున కొండపై ఉంటుంది. 2011లో తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త వాటర్ రాపెల్లింగ్ పోటీలు నిర్వహించారు. 12 కేటగిరీల్లో ఈ పోటీలు జరిగాయి. దాదాపు 300 మంది జాతీయ, అంతర్జాతీయ ఔత్సాహికులు ఇందులో పాల్గొన్నారు. గాయత్రి జలపాతానికి 19 కిలోమీటర్ల దూరంలోనే కుంతాల జలపాతం ఉంటుంది. అయితే, ఈ జలపాతం ఎత్తు తక్కువ. 135 అడుగులు మాత్రమే ఉంటుంది. అందుకే ట్రెక్కింగ్‌కు గాయత్రి జలపాతం అనుకూలమైనదిగా భావిస్తారు.
Read Also- Venu Madhav: నడిచి వస్తున్న వేణుమాధవ్.. గుండెలు పిండేసే వీడియో వైరల్!