Minimoons: రాత్రిళ్లు ఆకాశం చూడగానే ఠక్కున కనిపించే వాటిలో చందమామ ముందు వరుసలో ఉంటుంది. చిన్నప్పుడు అమ్మ.. ఆకాశాన్ని చూపించే గోరుముద్దలు తినిపించేది. వెన్నెల వెలుగు.. హృదయాలకు ఎంతో ప్రశాంతతను సైతం అందిస్తుంటుంది. అయితే అంతరిక్షంలో చందమామకు సంబంధించి నిర్వహించిన తాజా అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగుల చూశాయి. భూమి చుట్టూ ఏ సమయంలోనైనా కనీసం ఆరు మినీ మూన్ (Six Mini Moons) లు ఉండవచ్చని లేటెస్ట్ స్టడీ స్పష్టం చేసింది.
తాత్కాలికం మాత్రమే..
ఇకారస్ జర్నల్ (journal Icarus)లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం.. భూమి చుట్టూ ఉన్న కక్ష్యలో కనీసం ఆరు మినీ మూన్లు ఉండవచ్చని తేలింది. భూమి చుట్టూ తాత్కాలికంగా తిరిగే చిన్న గ్రహశకలాలు, ఆస్టరాయిడ్‌లను మినీ మూన్ లుగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తుంటారు. ఈ మినీ మూన్ లు.. చాలా చిన్నవిగా 6.5 అడుగుల (2 మీటర్లు) కంటే తక్కువ పరిమాణంలో ఉంటూ తాత్కాలికంగా భూమి చుట్టూ ఉండే స్వభావాన్ని కలిగి ఉన్నాయని లేటెస్ట్ స్టడీ తెలిపింది. ఇవి కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాత భూ కక్ష్య నుంచి తిరిగి సౌర వ్యవస్థలోకి వెళ్లిపోతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
టెలిస్కోప్‌తో చూడొచ్చు..
అయితే ఈ మినీ మూన్ లను కనుకొనడం.. చాలా కష్టంతో కూడుకున్న పని అని తాజా అధ్యయనం అభిప్రాయపడింది. అవి చాలా చిన్నవిగా ఉండటంతో పాటు మసకగా కనిపిస్తాయని తెలిపింది. అయితే అధునాతన టెలిస్కోప్, గణన పద్దతులను ఉపయోగించి.. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ మినీ మూన్ లను కనుగొనగలుగుతున్నట్లు లేటెస్ట్ స్టడీ స్పష్టం చేసింది. అయితే ఈ మినీ మూన్స్.. ఆస్టరాయిడ్ బెల్ట్ నుంటి వచ్చేవని ఇప్పటివరకూ భావిస్తూ వచ్చారు. కానీ చంద్రుడి నుంచి కూడా ఇవి రావొచ్చని తాజా పరిశోధన సూచిస్తోంది. కాబట్టి ఈ అధ్యయనం.. భూమి సమీప కక్ష్యలో ఈ మినీ మూన్ లు ఎలా ఏర్పడతాయి? ఎంత కాలం ఉంటాయి? వాటి స్వభావం ఏంటి? వంటి అంశాల్లో లోతైన అవగాహనను అందించనుంది.
Also Read: Germany Accident: విచిత్రమైన ప్రమాదం.. పైకప్పు మీదకు దూసుకెళ్లిన కారు.. చివరికి!
పరిశోధకుడు ఏమంటున్నారంటే?
హవాయి విశ్వవిద్యాలయ పరిశోధకుడు.. లేటెస్ట్ స్డడీకి సంబంధించిన ప్రధాన రచయిత రాబర్ట్ జెడికే (Robert Jedicke).. మినీ మూన్స్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇది చతురస్ర నృత్యం లాంటింది. ఇక్కడ భాగస్వాములు క్రమం తప్పకుండా మారుతుంటారు. కొంతకాలం నృత్యం చేసిన తర్వాత డ్యాన్స్ ఫ్లోర్ ను విడిచిపెట్టేస్తారు’ అంటూ స్పేస్. కామ్ (Space.com) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అయితే మినీ మూన్స్ పరిమాణం చిన్నగా ఉన్నందువల్ల వాటిని గుర్తించడం కష్టమని జెడికే సైతం స్పష్టం చేశారు. ఒక వేళ అవి భూమికి దగ్గరగా ఉన్నా.. ఆకాశంలో వేగంగా కదులుతున్నట్లు కనిపిస్తాయని చెప్పారు. మినీ మూన్ లను అధ్యయనం చేయడం ద్వారా చంద్రుని చరిత్ర, బిలం ఏర్పడే ప్రక్రియ, సౌర వ్యవస్థ ఎలా ఏర్పడి.. అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవడం సాధ్యమవుతుందని అన్నారు.