Shani Dev: హిందూ ధర్మంలో శనీశ్వరుడు ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాడు. జాతకంలో శని దోషాలు ఉన్నవారు శనీశ్వర ఆలయాలకు వెళ్లి పూజలు చేయడం సర్వసాధారణం. అయితే, శని విగ్రహం పక్కనే దక్షిణాన కాళికాదేవి విగ్రహం కూడా ఉండటం మీరు గమనించవచ్చు. ఈ రెండు దైవాలను కలిపి ఆరాధించడం వెనుక లోతైన ఆధ్యాత్మిక కారణాలు, ఆసక్తికరమైన రహస్యాలు దాగి ఉన్నాయి.
శని, కాళీ మధ్య సంబంధం పురాణాల ప్రకారం, శనీశ్వరుడు సూర్యుని కుమారుడు, యమ ధర్మరాజు సోదరుడు కర్మఫలదాత. మానవులు చేసే మంచి-చెడు కర్మల ఆధారంగా శని శుభాశుభ ఫలితాలను ప్రసాదిస్తాడు. ఆయన అనుగ్రహం ఉంటే జీవితం సుఖమయం, కానీ వక్రదృష్టి పడితే కష్టాలు, నష్టాలు, సవాళ్లు తప్పవని భక్తుల విశ్వాసం.
శని పూజలో కొంచం అజాగ్రత్తగా ఉన్నా ప్రతికూల ఫలితాలను తెచ్చిపెడుతుందని నమ్మకం. ఈ ప్రతికూలతల నుండి రక్షణ కల్పించడానికి శనీశ్వరునితో పాటు దక్షిణ కాళికాదేవిని ఆరాధిస్తారు. కాళికాదేవి ఆదిపరాశక్తి యొక్క ఉగ్రరూపం అయినప్పటికీ, భక్తులకు కరుణామయి. ఆమె శక్తి స్వరూపిణి, దుష్టశిక్షకి, శిష్టరక్షకి. కాలానికి అధిదేవతగా, కాళి అన్ని ప్రతికూల శక్తులను నాశనం చేసి, భక్తులను భయాలు, ఆపదల నుండి కాపాడుతుంది.
దక్షిణ కాళి రూపం సౌమ్యమైనది, భక్తుల కోరికలను తీర్చే తల్లిగా, ఆపద్బాంధవిగా కొలవబడుతుంది. శని-కాళి ఆరాధన యొక్క ప్రాముఖ్యతశని ఆలయంలో దక్షిణ కాళికాదేవిని పూజించడం ద్వారా జీవితంలోని దుఃఖాలు, భయాలు, అడ్డంకులు, దరిద్రం తొలగిపోతాయని, విజయం, శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం.
ముఖ్యంగా శనివారం రోజున శని ఆలయంలో కాళికాదేవిని దర్శించి, ప్రత్యేక పూజలు చేయడం వల్ల శని దోషాల నుండి విముక్తి, మానసిక శాంతి, కోరిన కోరికల నెరవేర్పు సాధ్యమవుతాయని ప్రగాఢ విశ్వాసం. అందుకే, శని ఆలయాలలో కాళికాదేవి ఆరాధన కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, దాని వెనుక లోతైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య కారణాలు ఉన్నాయి. ఈ ఆరాధన భక్తులకు శని దోషాల నుండి రక్షణ, జీవితంలో సుఖసంతోషాలను అందిస్తుందని నమ్ముతారు.
