Inflation: గత నెల జూన్ 2025లో రిటైల్ ద్రవ్యోల్బణం (Consumer Price Index) 2.10 శాతానికి దిగివచ్చింది. గత ఆరేళ్లలో ఇదే కనిష్ఠ స్థాయి అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సోమవారం కీలకమైన గణాంకాలను విడుదల చేసింది. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడం ద్రవ్యోల్బణం తగ్గుదలకు కారణమని, గతేడాది ఇదే కాలంలో ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు తక్కువగా నమోదయిందని వివరించింది. దీంతో, వరుసగా ఐదవ నెలలో కూడా ఆర్బీఐ లక్ష్య పరిమితి అయిన 4 శాతం కన్నా తక్కువగా నమోదయిందని వివరించింది. ఇక, గరిష్ఠ పరిమితి అయిన 6 శాతం కంటే తక్కువగా నమోదు కావడం ఇది వరుసగా ఎనిమిదవ నెల అని వివరించింది. జనవరి 2019 తర్వాత ప్రస్తుతం నమోదయిన 2.10 శాతమే అత్యల్పమని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2025 మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.82 శాతంగా, జూన్ 2024లో 5.08 శాతంగా ఉందని ప్రస్తావించింది.
Read Also- Viral News: ట్రాఫిక్‌లో 2 గంటలు చిక్కుకున్న కంపెనీ ఓనర్.. కీలక నిర్ణయం
టోకు ద్రవ్యోల్బణంలోనూ తగ్గుదల
జూన్ 2025లో టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI) కూడా గణనీయంగా తగ్గింది. 0.13 శాతానికి పతనమైందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన డేటాలో పేర్కొంది. 2025 జూన్‌లో వెహికల్స్, ఫ్యూయల్, ఫుడ్ గూడ్స్ ధరలు తగ్గడం ఇందుకు దోహదపడిందని పేర్కొంది. మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 0.39 శాతంగా ఉండగా, జూన్ నెలలో 0.13 శాతానికి పడిపోయిందని పేర్కొంది. ఉత్పత్తిదారుల స్థాయిలో వస్తువుల ధరలలో మార్పులను ‘టోకు ద్రవ్యోల్బణం’ ద్వారా సూచిస్తుంటారు. అంటే, వస్తువుల బల్క్ కొనుగోళ్లకు సంబంధించిన ధరలను ఇది ప్రతిబింబిస్తుంది. వ్యవసాయం, మైనింగ్, తయారీ రంగాలలో ధరల మార్పులను కూడా పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తారు.
Read Also- Air India: విమాన ప్రమాద ప్రాథమిక రిపోర్టుపై ఎయిరిండియా కీలక ప్రకటన
ద్రవ్యోల్బణం తగ్గుదలపై కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ ఉపాసన భరద్వాజ్ స్పందించారు. ‘‘ఆహార సంబంధిత పదార్థాల ధరలు అదుపులో ఉండడమే ఈసారి ద్రవ్యోల్బణం తగ్గుదలకు కారణం. అయితే, కోర్ ఇన్‌ఫ్లేషన్ కొద్దిగా పెరిగింది. మరీ అంతగా లేకపోవడంతో ఆర్థిక సంవత్సరం 2026లో ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనా 3.7 శాతం కంటే 0.50 శాతం తక్కువగానే ఉండవచ్చని ఆశిస్తున్నాం’’ అని భరద్వాజ్ పేర్కొన్నారు. కాగా, కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ జూన్‌లో కీలకమైన రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో, రెపో రేటు 5.5 శాతానికి తగ్గింది. రెపో రేటులో కోత విధించడం 2025లో వరుసగా ఇది మూడోసారి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూ, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించాలనే విధానాన్ని ఆర్బీఐ అవలంబిస్తోంది. అందుకే, వడ్డీ రేట్లు తగ్గించడంపై దృష్టిసారించింది.
Read Also- Mohammed Siraj: సిరాజ్‌కు ఐసీసీ బిగ్ షాక్.. భారీ జరిమానా విధింపు