Viral Video: ఎన్‌క్లోజర్‌లో ఉండాల్సిన సింహం ఒక్కసారిగా తప్పించుకొని జనావాసంలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో ఈ షాకింగ్ ఘటన (Viral Video) జరిగింది. ఓ సంపన్న కుటుంబం పెంచుకుంటున్న సింహం ప్రహరీ గోడ ఎక్కి.. పక్కనే జనాలు సంచరిస్తున్న వీధిలోకి దూకింది. అలా దూకిందో లేదో పరిగెత్తుకెళ్లి అటుగా వస్తున్న ఒక మహిళపై దాడికి పాల్పడింది. దుకాణానికి వెళ్లి వస్తున్న బాధిత మహిళ వీపుపై పంజా విరిసింది. దీంతో, ఆమె కిందపడిపోయింది. అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడింది. సింహం ఇంకాస్త ముందుకెళ్లి మరో ఇద్దరు పిల్లలపై దాడి చేసింది. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది. సింహం ప్రహరీ గోడ ఎక్కి దూకుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసులు శుక్రవారం వెల్లడించారు. సింహం ప్రహరీ గోడ ఎక్కి బయటకు దూకుతున్న సీసీ ఫుటేజీని కూడా విడుదల చేశారు. అటుగా వస్తున్న మహిళపై సింహం దూకడం, ఆమె కిందపడిపోవడం వీడియోలో కనిపించింది.
Read also- Twist in Marriage: పెళ్లిలో బిగ్ ట్విస్ట్.. ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు!
ఐదు, ఏడేళ్ల వయసున్న తన ఇద్దరి పిల్లలపై సింహం దాడి చేసిందని ఓ వ్యక్తి చెప్పారు. తన పిల్లలకు చేతులు, ముఖాలకు గాయాలయ్యాయని వాపోయారు. అయితే, సింహం బయటకు వచ్చి దాడి చేస్తుండగా, యజమానులు చూస్తూ ఆనందించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధితులు ముగ్గుర్నీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఎవరికీ ప్రాణపాయం లేదని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. ఘటన జరిగిన తర్వాత నిందిత వ్యక్తులు సింహాన్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోయారని, దర్యాప్తు మొదలు పెట్టి 12 గంటల వ్యవధిలోనే వారిని అరెస్ట్ చేసినట్టు లహోర్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆపరేషన్స్ వెల్లడించారు. దాడికి పాల్పడ్డ సింహం వయసు 11 నెలలు ఉంటుందని, అది మగ సింహమని, దానిని పట్టుకొని వణ్యప్రాణి సంరక్షణా కేంద్రానికి తరలించామని వివరించారు. సింహం ఆరోగ్యం బాగానే ఉందని వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం అధికారులు తెలిపారు.
Read also- Actress Lavanya: లావణ్య మెడకు చుట్టుకున్న మరో వ్యవహారం.. ఫోన్ స్విచాఫ్
సంపదకు చిహ్నం
పాకిస్థాన్‌లో అత్యధిక జనాభా ఉండే పంజాబ్ ప్రావిన్స్‌లో విదేశాలకు చెందిన జంతువులను, ముఖ్యంగా సింహాలను పెంచుకోవడం ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. దీనిని సంపన్నులు గొప్ప దర్పంగా భావిస్తుంటారు. డిసెంబర్ 2024లో లాహోర్‌లోని ఒక ఏరియాలో ఒక పెద్ద సింహం పెంచుతున్న ఇంటి నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది. ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు భయభ్రాంతులకు గురికావడంతో సెక్యూరిటీ గార్డు ఆ సింహాన్ని కాల్చిచంపాడు. ఆ ఘటన పంజాబ్ ప్రభుత్వం కీలక చట్టాన్ని తీసుకొచ్చింది. సింహాల విక్రయం, కొనుగోలు, పెంపకం, యాజమాన్యంపై నియంత్రణ తీసుకొస్తూ కొత్త చట్టాలను ఆమోదించింది. నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉంచకుండా, ముందుగానే సింహాల పెంపానికి యజమానులు లైసెన్స్‌లు పొందడం తప్పనిసరి చేసింది. ఈ చట్టం ప్రకారం, పెంపకందారులు రిజిస్ట్రేషన్ కోసం భారీగా ఫీజు చెల్లించాలి. సింహాన్ని పెంచేందుకు కనీసం 10 ఎకరాల స్థలం ఉండడం తప్పనిసరి చేసింది.
A Tiger attacks a woman and two children in Johar Town, Lahore pic.twitter.com/v1wSFFpP40
— Israr Ahmed Rajpoot (@ia_rajpoot) July 4, 2025