Techie self Lock: సాధారణంగా, మూడు నాలుగు రోజులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకపోతే ఏదోలా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా ప్రభావితం అయ్యినట్టు అనిపిస్తుంది. మరీ, ఇంటికి తాళం వేసుకొని ఏకంగా 3 సంవత్సరాలు లోపలే ఉంటే?, ఊహించడానికే భయంకరంగా ఉన్న ఈ పరిస్థితిని ఓ వ్యక్తి అనుభవించాడు. నవీ ముంబైకి చెందిన అనుప్ కుమార్ నాయర్ అనే 55 ఏళ్ల వ్యక్తి ఏకంగా మూడేళ్లపాటు అపార్ట్‌మెంట్ లోపలే ఉన్నాడు. బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా పూర్తిగా ఒంటరి జీవితం గడిపాడు. తనను తాను ఐసోలేషన్‌లో ఉంచుకోగా, గత వారమే ఓ స్వేచ్ఛంధ సేవా సంస్థ ఆయనను రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చింది. కుటుంబ సభ్యులు అందరూ చనిపోవడం, ఫ్రెండ్స్ ఎవరూ లేకపోవడంతో అనుప్ కుమార్ నిరాశ నిస్పృహలో కూరుకుపోయాడు. ఒంటరి జీవితం గడిపాడు. మానసికంగా దెబ్బతిని తనంతట తానుగా నిర్బంధించుకున్నాడు.
ఒకప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామర్
అనుప్ కుమార్ నాయర్ గతంలో కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా పనిచేశాడు. నవీ ముంబైలో జుయినగర్‌లోని సెక్టార్ 24లోని ఘర్కూల్ సొసైటీలో నివాసం ఉన్నాడు. సీల్ (సోషల్ అండ్ ఎవాంజెలికల్ అసోసియేషన్ ఫర్ లవ్) అనే ఎన్జీవోకు చెందిన సామాజిక కార్యకర్తలు ఈయనను రక్షించారు. సామాజిక కార్యకర్తలు ఆ ప్లాట్‌లోకి ప్రవేశించే సమయానికి అనుప్ భయానకమైన పరిస్థితులలో ఉన్నాడు. ఎటుచూసినా చెత్త పేరుకుపోయి దుర్వాసన కొట్టింది. తీవ్రమైన కాళ్ల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు కార్యకర్తలు గుర్తించారు. మూడేళ్లలో కనీసం ఒక్కసారి కూడా బయటకు రాకపోవడమే ఈ ధీన పరిస్థితికి కారణం. అయితే, అనుప్ కుమార్ కేవలం ఫుడ్ డెలివరీ యాప్‌ల ద్వారా మాత్రమే బయటి ప్రపంచంతో సంబంధాన్ని కొనసాగించాడు. అంతకుమించి అసలు ఎప్పుడూ బయటకు రాలేదు. ఆహార అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే ఫుడ్ డెలివరీ యాప్‌లను ఉపయోగించుకున్నాడు.
Read this- Facebook: గుట్టుచప్పుడుకాకుండా ఫేస్‌బుక్ కొత్త టెస్టింగ్
వెంటాడిన విషాదాలు
కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా మంచి జీతం సంపాదించిన రోజుల్లో అనుప్ కుమార్ ఒదిగి ఉండేవారట. అయితే, వరుస విషాదాలు ఆయనను వెంటాడాయి. కొన్నేళ్ల కిందట తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. దాదాపు 20 ఏళ్లక్రితం తన అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో ఇష్టమైన తోబుట్టువు చనిపోవడం, అమ్మానాన్నలు కూడా మృతి చెందడాన్ని ఆయన తట్టుకోలేకపోయారు. ఒంటరి అనే ఆలోచన ఆయనను చిదిమేసింది. మానసికంగా బాగా కుంగిపోయాడు. చివరికు స్నేహితులు, ఇరుగుపొరుగువారు సమాజానికి కూడా ఆయన దూరమయ్యాడు. ఒంటరిగా ఉండిపోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే, అదే సొసైటీలో నివసిస్తున్న వ్యక్తి ఒకరు అనుప్ పరిస్థితిపై బాధపడ్డారు. స్వచ్ఛంధ సంస్థ సీల్‌కు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందిన వెంటనే ఎన్జీవో స్పందించింది. అపార్ట్‌మెంట్‌కు చేరుకుని అనుప్‌ను బయటకు తీసుకొచ్చింది. చికిత్స కోసం ఏర్పాట్లు కూడా చేసింది.
Read this- Kareena Kapoor: సైఫ్‌పై దాడి గురించి తొలిసారి స్పందించిన కరీనా కపూర్
డోర్ తెరవడం చాలా అరుదు
అనుప్ కుమార్ డోర్ తెరవడం చాలా అరుదు అని, చెత్తను పారవేయడం తాను ఎప్పుడూ చూడలేదని ఘర్కూల్ సొసైటీ చైర్మన్ విజయ్ షిబే చెప్పారు. ఆయనను బయటకు తీసుకురావడానికి తాము చిన్నచిన్న ప్రయత్నాలు చేశామని, తమకు కుదిరినప్పుడల్లా ఆర్థిక సహాయం కూడా అందించామని వివరించారు. కానీ, ఏదో పెద్ద తప్పు జరిగిందని అన్నారు. కాగా, సీల్ ఎన్జీవో సభ్యులను అలర్ట్ చేయడంలో నిఖిల్ మరాఠే అనే స్థానిక వ్యక్తి కీలక పాత్ర పోషించారు. “ఈ విధంగా ఒక వ్యక్తి నిశ్శబ్దంగా చిన్నాభిన్నం అవుతుంటే చూడడం చాలా బాధగా ఉంటుంది. మన చుట్టూ ఒంటరిగా నివసించే వారిపై మనం ఎంతోకొంత అవగాహనతో ” అని నిఖిల్ అభిప్రాయపడ్డారు. కాగా, అనుప్ కుమార్ నాయర్ ప్రస్తుతం సీల్ ఆశ్రమంలో చికిత్స పొందుతున్నాడు. అక్కడే పునరావాసం పొందుతున్నాడు. మానసికంగా అతడు ఇంకా బలహీనంగా ఉన్నప్పటికీ, వైద్యులు, సంరక్షకులు పర్యవేక్షిస్తుండడంతో ఆరోగ్యం, మానసిక స్థితిలో మెరుగుదల సంకేతాలు మొదలయ్యాయి. సీల్ కార్యకర్తలతో నాయర్ కొన్ని మాటలు మాత్రమే మాట్లాడాడు. “నా తల్లిదండ్రులు చనిపోయారు. నా అన్నయ్య కూడా ప్రాణాలతో లేడు. నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నా ఆరోగ్యం కూడా మంచిగా లేదు. కాబట్టి, నా జీవితం ప్రారంభానికి అవకాశం లేదు” అని చెప్పాడు.