Viral: మనం ఇప్పటికీ ఎన్నో ఆచారాలను వినే ఉంటాము. అయితే, ఇలాంటి ఆచారం ఎక్కడా విని ఉండరు. ఇది చూడటానికే చాలా భయంకరంగా ఉంది. మరి, ఆ వింత ఆచారం ఏంటో మీరు కూడా ఇక్కడ చదివి తెలుసుకోండి..
కూత్తాండవర్ రథోత్సవం
తమిళనాడులోని కూవాగం గ్రామంలో జరిగే కూత్తాండవర్ రథోత్సవం ఓ వింత ఆచారం ఆందర్ని షాక్ కు గురి చేస్తుంది. కళ్లకురిచ్చి జిల్లాలోని కూవాగం గ్రామంలో చిత్తిరై ఉత్సవాలలో భాగంగా హిజ్రాలు ఈ వింత ఆచారాన్ని పాటిస్తారు. ఈ నేపథ్యంలోనే వారంతా ఆలయ పూజారి చేతుల మీదుగా తాళి కట్టించుకుంటారు.
తాళిబొట్లను తెంచిపడేసే ఆచారం
పగలు, రాత్రి ఆటపాటలతో, నృత్యాలు చేస్తారు. ఈ ఉత్సవం కోసం కూవాగం, కిలక్కు కుప్పం, శిరాలాయం కుళం, పందలాడి వంటి గ్రామాల నుంచి ప్రజలు వెళ్తారు. రథంపై కూత్తాండవర్ దేవుని చేతులు, కాళ్లు, శిరస్సు ఆకారాలను తీసుకొచ్చి ఉంచుతారు. ఈ ఉత్సవం ముగిసిన తర్వాత బలిదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ బలిదానంలో తమ దేవుడు బలి కావడంతో హిజ్రాలు కూడా తమ తాళిబొట్లను తెంచిపడేసి, బాధతో ఏడుస్తారు. ఆ తర్వాత, అక్కడున్న కొలనులో తల స్నానం చేసి, తెల్లచీరలు ధరించి తమ గ్రామాలకు తిరిగి వెళ్తారు.
మహాభారతంలో కూడా ఈ కథ ప్రస్తావన
కూత్తాండవర్ రథోత్సవం గురించి మహాభారతంలోని అరవన్ కథలో ప్రస్తావించారు. అరవన్ పాండవ యోధుడు అర్జునుడి, నాగ కన్య ఉలూపి కుమారుడు. మహాభారత యుద్ధంలో పాండవుల విజయం కోసం ఒక మానవ బలి అవసరమని సహదేవుడు (జ్యోతిష్య నిపుణుడు) చెబుతాడు. అప్పుడు ఎవరూ ముందుకు రాకపోతే అరవన్ తనను తాను బలిగా అర్పించుకోవడానికి ముందుకొచ్చాడు. అయితే, అతను మూడు వరాలు కోరాడు.
1. మొదటిది తాను చనిపోయే ముందు ఒక రోజు అయిన వైవాహిక జీవితాన్ని అనుభవించాలని కోరుతాడు
2.రెండోది కురుక్షేత్ర యుద్ధాన్ని తన తలతో చూడాలని కోరుతాడు.
3.మూడోది భూమిపై తనను కొలిచేందుకు ఒక దేవాలయం నిర్మించబడాలని కోరతాడు.
అయితే, అరవన్‌ను పెళ్లి చేసుకోవడానికి ఒక్కరూ కూడా ముందుకు రాలేదు, ఎందుకంటే ఆ తర్వాత రోజే అతను బలి కాబోతున్నాడు. దీంతో, శ్రీకృష్ణుడు మోహిని రూపంలో అరవన్‌ను వివాహమాడతాడు. మరుసటి రోజు అరవన్ బలి అయిన తర్వాత, మోహిని వితంతువుగా విలపించింది. ఈ పురాణ కథ ఆధారంగా, కూవాగం ఉత్సవంలో హిజ్రాలు అరవన్‌ను పెళ్లి చేసుకుని, మరుసటి రోజు అతని మరణాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటారు.