Khammam Tragedy: గతంలో లాగానే ఈ సంవత్సరం కూడా తమ్ముడికి రాఖీ కట్టాలని ఆ అక్క భావించింది. రాఖీ కట్టి మిఠాయి తినిపించాలని.. నిండు నూరేళ్లు తన ఆయుష్షు కూడా పోసుకొని జీవించేలా ఆశీర్వచనం అందజేయాలని కలలు కన్నది. బదులుగా తన రక్షణకు తమ్ముడు ఎలాంటి హామీ ఇస్తాడో తెలుసుకోవాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూసింది. రాఖీకి ప్రతిఫలంగా తమ్ముడి నుంచి కొంత డబ్బును డిమాండ్ చేసి.. ఆటపట్టించాలని కూడా ఆశపడింది. అయితే ఎవరూ ఊహించని విధంగా తమ్ముడి మరణంతో ఆమె కన్న కలలన్నీ పటాపంచలు అయ్యాయి. చనిపోయి శవంగా పడి ఉన్న తమ్ముడికి రాఖీ కట్టాల్సిన దుస్థితి ఆమెకు ఏర్పడింది.
అసలేం జరిగిందంటే?
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురం గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పందిరి అప్పిరెడ్డి (Pandiri Appi Reddy) అనే వ్యక్తి.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తాజాగా తుదిశ్వాస విడిచాడు. దీంతో కుటుంబంలో విషాధచాయలు అలుముకున్నాయి. అయితే అప్పిరెడ్డికి జ్యోతి అనే అక్క ఉంది. తమ్ముడి మరణవార్త విని ఆమె గ్రామానికి ఉరుకులు పరుగుల మీద పరిగెత్తుకొని వచ్చింది. రాఖీ పండగకు సరిగ్గా రెండ్రోజుల ముందు తమ్ముడు చనిపోవడంతో అపిరెడ్డి పార్థివదేహం వద్ద కన్నీరు మున్నీరుగా విలపించింది.
తమ్ముడి శవానికి రాఖీ
ప్రతీ సంవత్సరం లాగానే.. ఈ ఏడాది కూడా కట్టాలని భావించిన రాఖీని తన వెంట జ్యోతి తీసుకొచ్చింది. దానిని శవంగా పడి ఉన్న సోదరుడికి కట్టి తన ప్రేమను వ్యక్త పరిచింది. ఈ దృశ్యాలు చుట్టుపక్కల వారిని సైతం కన్నీరు పెట్టించేలా చేశాయి. ఇకపై రాఖీ ఎవరికి కట్టాలంటూ ఆమె రోదిస్తున్న తీరు.. హృదయాలను కలిచివేసింది. అక్కా తమ్ముళ్ల అనుబంధాన్ని చూసి అక్కడి వారి కళ్లు చెమడ్చాయి. ఇలాంటి కష్టం ఏ సోదరికి రాకుడదని గ్రామస్తులు కోరుకుంటున్నారు.
విషాదకర ఘటన.. చనిపోయిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురంలో ఘటన
అనారోగ్యంతో పందిరి అప్పిరెడ్డి అనే వ్యక్తి మృతి
మరో రెండు రోజుల్లో రాఖీ పండుగ కావడంతో మృతి చెందిన తమ్ముడికి పాడె మీద ఉండగానే చివరిసారిగా రాఖీ కట్టిన అక్క జ్యోతి
చూపరులను కంటతడి… pic.twitter.com/NSzMuUA9aH
— BIG TV Breaking News (@bigtvtelugu) August 7, 2025
రాఖీ పండుగ ప్రత్యేక తెలుసా?
రాఖీ పౌర్ణమి రోజున మహిళలు.. తమ సోదరుడి మణికట్టుకు రాఖీ (పవిత్రమైన దారం) కడతారు. సోదరుడికి దీర్ఘాయుష్షు, ఆనందం ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తారు. ఇందుకు బదులుగా తన సోదరిని ఎల్లప్పుడూ రక్షిస్తానని.. అన్ని వేళలా మద్దతుగా నిలుస్తానని సోదరుడు హామీ ఇస్తారు. ఈ పండుగ సోదరభావాన్ని బలోపేతం చేయడమే కాక కుటుంబ విలువలను సైతం చాటి చెబుతుంది.
Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షం.. గుబులురేపుతున్న వార్నింగ్స్.. ఇక అంతా జలమయమేనా!
రాఖీ కట్టకపోతే ఏం జరుగుతుంది?
రాఖీ కట్టడం ఒక సాంప్రదాయిక ఆచారం మాత్రమే కాదు. సోదరి, సోదరుడి మధ్య ఉన్న భావోద్వేగ బంధానికి ప్రతీక. అయితే రాఖీ కట్టకపోతే కచ్చితంగా చెడు జరుగుతుందన్న అభిప్రాయం లేదు. ఎటువంటి దుష్పరిణామాలు జరగవు. ఈ సంప్రదాయం అక్క తమ్ముడు, అన్నా చెల్లెళ్ల హృదయపూర్వక భావనలపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఆచారం పాటించకపోతే సోదరి సోదరుడి మధ్య భావోద్వేగ బంధం లేదా సంప్రదాయం ప్రాముఖ్యత కొంత మేర తగ్గవచ్చని కొందరు భావిస్తుంటారు. అయితే దూరాభార సమస్యలు, సోదరులతో మనస్ఫర్థలు కారణంగా రాఖీ పండుగను కొందరు జరుపుకోని వారు కూడా ఉన్నారు.