Water Car: నీళ్లతో నడిచే కారును తయారు చేశారంటూ చాలాసార్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈసారి ప్రాక్టికల్‌గా చూపిస్తూ మరీ, ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వైరల్ వీడియోలో ఇరాన్ శాస్త్రవేత్త అలాఉద్దీన్ ఖాసెమి కనిపిస్తున్నారు. ఈ వీడియో క్లిప్‌లో ఖాసెమి తాను పెట్రోల్, డీజిల్ కాకుండా, పూర్తిగా నీళ్లతో నడిచే కారును తయారు చేశానని (Water Car) చెబుతున్నారు. తన కారు ఫ్యూయల్ ట్యాంక్‌ను సాధారణ నీటితో నింపారు. తోటలకు నీరు పట్టే పైపును ఉపయోగించి ట్యాంక్‌ను నింపడం ఆ వీడియోలో కనిపించింది. ఈ వాహనంలోని ఇంజన్ ఆ నీటిని హైడ్రోజన్‌గా, ఆక్సిజన్‌గా వేరు చేస్తుందని, ఈ రసాయన చర్య ద్వారా ఉత్పత్తయ్యే శక్తితో వాహనం నడుస్తుందని ఆయన వివరిస్తున్నారు.
ఈ కారు 60 లీటర్ల నీటిని నిల్వ చేయగలదని ఖాసెమి చెబుతున్నారు. డీజిల్, పెట్రోల్ వంటి ఇంధనం, లేదా విద్యుత్ అవసరం లేకుండా సుమారుగా 900 కిలోమీటర్లు, లేదా దగ్గరదగ్గరగా 10 గంటలపాటు కారు ప్రయాణించగలదని ఖాసెమి పేర్కొన్నారు. పైగా, ఈ కారు ఎలాంటి కాలుష్య కారకాలను విడుదల చేయదని, కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుందని చెప్పారు. అందుకే, ఈ కారు పూర్తిగా పర్యావరణ సానుకూలమైనదని ఆయన వివరించారు.
నిపుణుల సందేహాలు ఇవే
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై చాలా మంది స్పందిస్తున్నారు. శాస్త్రవేత్త ఖాసెమి చెబుతున్న విషయాలు విని ఆశ్చర్యపోతున్నారు. అయితే, శాస్త్రవేత్తలు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నీటిని హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విభజించడం ఎక్కువ శక్తిని వినియోగించే ప్రక్రియ అని నిపుణులు అంటున్నారు. ఆయన చెబుతున్నదాని ప్రకారమైతే, ఇంజిన్ ఉత్పత్తి చేసే శక్తి కంటే, ఎక్కువ శక్తిని దానికి అందించాల్సిన అవసరం ఉంటుందని, ఇది ప్రాథమిక థర్మోడైనమిక్స్ నియమాలను విరుద్దమని వివరిస్తున్నారు.
An Iranian scientist claims he's built a car that runs on nothing but water. The inventor says the vehicle uses a process to split water into hydrogen and oxygen, then burns the hydrogen to power the engine allegedly traveling 900 km on 60 liters! God save his life 👍🏻 pic.twitter.com/7Am2x716Gi
— Rattan Dhillon (@ShivrattanDhil1) October 19, 2025
శాస్త్రవేత్తల సంగతి పక్కనపెడితే, సాధారణ నెటిజన్లు మాత్రం శాస్త్రవేత్త ఖాసెమిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ ఆవిష్కరణను విప్లవాత్మకమని చాలామంది మెచ్చుకున్నారు. దేవుడు ఆయనను రక్షించాలని ఒకరు, ఈ వ్యక్తి త్వరలోనే అదృశ్యమవుతాడంటూ ఇలా చాలామంది భిన్నరకాలుగా కామెంట్లు పెట్టారు. కాగా, నీళ్లతో నడిచే వాహనం కనిపెట్టామనే వాదన ఇదే తొలిసారి కాదు. గతంలో భారత్‌కు చెందిన ఓ యువకుడు కూడా తన బైక్‌ను నీటితో నడుపుతున్నానని చెప్పాడు. ఇందుకు సంబంధించి ఒక వీడియోను కూడా యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియో క్లిప్‌లో అతడు బైక్ ఇంధన ట్యాంక్‌లో నీళ్లు పోయడం, కొన్ని విఫల ప్రయత్నాల తర్వాత, కొద్దిసేపు నడపడం వీడియోలో కనిపించాయి. అయితే, ఆ వీడియో నిజమైనదా?, కాదా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Read Also- Bigg Boss Telugu 9: నువ్వు, నీ ఓవరాక్షన్, నీ లవ్ యవ్వారాలు నాకు నచ్చలే.. రీతూకి షాకిచ్చిన ఆయేషా!
