తల్లి దండ్రులకు పిల్లలే ఆస్తి. ఉదయం నుంచి రాత్రి పడుకునే ముందు వరకు వారి గురించే ఆలోచిస్తుంటారు. ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ సందడే వేరు. ఎందుకంటే, ఇంటిని చక్క బెట్టడమే కాకుండా అన్ని పనులను చేస్తూ అమ్మ, నాన్నలకు కూడా సహాయపడుతుంది. అదే అబ్బాయి అయితే ఈ రోజుల్లో తన పనులు తాను చేసుకోవడానికి కూడా బద్దకిస్తున్నాడు. అందుకే ఆడపిల్ల ఉంటే ఆ ఇల్లు పది కాలాల పాటు చల్లగా ఉంటుందని మన పెద్ద వాళ్ళు కూడా అంటుంటారు. వారికి అవసరమైన జీవిత నైపుణ్యాలు, విలువలను నేర్పించడం వారి అభివృద్ధికి చాలా ముఖ్యం. తల్లిదండ్రులు తమ కూతుళ్లకు నేర్పించాల్సిన కొన్ని ముఖ్యమైన నైపుణ్యాల గురించి నిపుణులు పదేపదే సూచిస్తున్నారు.
నిపుణుల సూచనలు
ఆత్మ విశ్వాసం
ఏదైనా పని చేసేటప్పుడు తన మీద తాను నమ్మకాన్ని పెంపొందించుకోవడం నేర్పించాలి. చేసేది తప్పా ఒప్పా అనేది తెలుసుకునేలా తీర్చిదిద్దాలి.
కమ్యూనికేషన్
తన ఆలోచనలను స్పష్టంగా వ్యక్తీకరించడం చాలా ముఖ్యం. సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేలా పెంచాలి. అంతేకాదు, శ్రద్ధగా వినడం అలవరుచుకునేలా చేయాలి. ఏదైనా మంచి విషయం గురించి చెప్పేటప్పుడు శ్రద్ధగా విని ఆచరించేలా చూసుకోవాలి.
ఎమోషనల్ ఇంటెలిజెన్స్
వారి భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నిర్వహించడం, అలాగే ఇతరులతో సానుభూతి చూపడం పిల్లలకు చాలా ముఖ్యం. చిన్న వయసులోనే వీటిని ఆచరిస్తే పెద్దయ్యాక ప్రయోజకులు కావడానికి దోహదపడతాయి.
ప్రాబ్లమ్ సాల్వింగ్
ఈ రోజుల్లో సమస్యలు లేని జీవితం లేదు. ఈ టెక్నాలజీ యుగంలో ప్రతీ చిన్న విషయం చుట్టూ ఏదో ఒక సమస్య తలెత్తుతున్నది. అందుకే, సృజనాత్మకంగా, సమర్థవంతంగా సమస్యలకు పరిష్కారాలను కనుగొనేలా మీ ఆడబిడ్డను తీర్చిదిద్దాలి.
టైమ్ మేనేజ్‌మెంట్
సమయం చాలా ముఖ్యమైంది. గడిచిన కాలం తిరిగిరాదు. అందుకే, పనులను చక్కబెట్టడం, సమయాన్ని సమర్థవంతంగా వినియోగించడం అలవరుచుకొనేలా మీ పిల్లలను తీర్చిదిద్దాలి.
ఫైనాన్షియల్ లిటరసీ
ధనం మూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. ప్రస్తుత రోజుల్లో డబ్బు లేనిదే ఏ పనీ జరగడం లేదు. వృథా ఖర్చులతో చాలా కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎదుటి వారిని చూసి చాలా మంది హెచ్చులకు పోయి ఆర్థికంగా నష్టపోతున్నారు. అందుకే, డబ్బు నిర్వహణ, బడ్జెటింగ్, సేవింగ్ గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచే అవగాహన కల్పించాలి.
సెల్ఫ్ రెస్పెక్ట్
తనను తాను గౌరవించడం, ఇతరులతో ఆరోగ్యకరమైన హద్దులను ఏర్పరుచుకోవడం చాలా ముఖ్యం. ఏ తప్పు లేకున్నా నింద పడాల్సిన అవసరం లేదు. అలాగని, వివాదాలకు పోకుండా సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి.
ఎమ్పతీ
ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం చిన్నప్పటి నుంచే నేర్పించాలి.
సెల్ఫ్ కేర్
ఆరోగ్యం విషయంలో కేర్ చాలా ముఖ్యం. శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేలా పిల్లలను ప్రోత్సహించాలి.
డెసిషన్ మేకింగ్
ఏ విషయమైనా సరే ఆలోచించడం, సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం జీవితంలో ముఖ్యమైనవి.
లీడర్‌షిప్
ఆడపిల్లలకు లీడర్ క్వాలిటీస్ పెంచడంలో తల్లిదండ్రులది కీలక పాత్ర. ఈ విషయంలో వారిని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఇతరులను ప్రేరేపించేలా ప్రోత్సహించాలి.
గోల్ సెట్టింగ్
స్పష్టమైన, సాధ్యమైన లక్ష్యాలను నిర్ధేశించుకోవడం, వాటి కోసం కృషి చేయడం
రెసిలియన్స్
అవాంతరాలను అధిగమించడం, సానుకూలంగా నిలబడటం
నెగోషియేషన్
సమర్థవంతంగా చర్చించడం, ఒప్పందాలను కుదుర్చుకోవడం
టీమ్ వర్క్
ఇతరులతో సహకరించడం, సాధారణ లక్ష్యాలను చేరుకోవడం. భవిష్యత్తుకు ఇది గట్టి పునాదులు వేస్తుంది.
కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్
విభేదాలను శాంతియుతంగా, గౌరవప్రదంగా పరిష్కరించుకునేలా పిల్లలను ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం.
గమనిక: పలు అధ్యయనాలు నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.