Viral News: యువతలో గుండెపోటు మరణాలు సర్వసాధారణంగా మారిపోతున్నాయి. చిన్నవయసులో గుండెపోటు రాదనుకోవడం ఒక భ్రమగా మారిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో పెద్ద వయస్కుల్లో మాత్రమే కనిపించిన గుండెపోటు మరణాలు ఇప్పుడిక యువతనూ కబలిస్తున్నాయి. రోజుకొకరు, లేదా ఇద్దరు బలైపోతున్న పరిణామాలు కలచివేస్తున్నాయి. మానసిక ఒత్తిడి, అనారోగ్యకర జీవనశైలి కొందరికి సమస్యలుగా మారుతుండగా, ఫిట్‌నెస్ మోజులో మరికొందరు గుండెపోటుకు గురై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వ్యాయామం చేస్తూ కుప్పకూలిన యువకులు, స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువకులను ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలోనే చూశాం. అలాంటి షాకింగ్ ఘటన తాజాగా మరొకటి జరిగింది.
జిమ్ చేస్తూ కన్నుమూత
హర్యానాలోని ఫరీదాబాద్‌లో షాకింగ్ ఘటన జరిగింది. జిమ్‌లో వ్యాయామం చేస్తూ 35 ఏళ్ల యువకుడు గుండెపోటుకు గురై చనిపోయాడు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పంకజ్ అనే వ్యక్తి జీమ్‌లో ‘ట్రైసెప్స్ ఎక్స్‌టెన్షన్’ ప్రాక్టీస్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. పంకజ్ ఉదయం 10 గంటల సమయంలో ఫరీదాబాద్ సెక్టార్-8లోని శ్రౌత జిమ్ అండ్ వెల్నెస్ క్లబ్‌కు వచ్చినట్టుగా సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. వ్యాయామం ప్రారంభించడానికి ముందు ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగాడు. ఉదయం 10:20 గంటల సమయంలో భుజాలపై బలం పడే వ్యాయామం చేస్తున్నట్లు మరో సీసీఫుటేజీ ద్వారా వెల్లడైంది. కొద్దిసేపటి తర్వాత ‘ట్రైసెప్స్ ఎక్స్‌టెన్షన్’ చేయడం మొదలుపెట్టాడు. కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే పంకజ్ కుప్పకూలాడు. అతడు కిందపడిన అలకిడి విని, జిమ్‌లో తోటివారు వెళ్లి పరిశీలించారు. ముఖంపై నీళ్లు చల్లి, బ్రతికించే ప్రయత్నాలు చేశారు. సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్, డాక్టర్ల టీమ్‌ను పిలిపించారు. అయితే, వారు అక్కడికి చేరుకునే సరికే పంకజ్ చనిపోయాడు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు.
Read also- UP Shocking: భర్త చనిపోయాక మరుదులతో ఎఫైర్.. అత్తను లేపేసి చివరికి?
పైకిఎత్తలేక ఆసుపత్రికి తీసుకెళ్లలేదు
పంకజ్ మరణంపై జిమ్ ట్రైనర్ పునీత్ మాట్లాడారు. పంకజ్ హెవీ ఎక్సర్‌సైజులు చేయడం లేదని తెలిపారు. ‘‘పంకజ్ 175 కేజీల బరువుతో ఉండడంతో అతడిని పైఎత్తి హాస్పిటల్‌కు తీసుకెళ్లలేకపోయాం. అందుకే, వెంటనే వైద్యులను పిలిపించాం’’ అని పునీత్ వివరించారు. పంకజ్ గుండెపోటుతో మరణించినట్టు ప్రాథమిక దర్యాప్తుల్లో వెల్లడైంది. పంకజ్ మృతిపై పోలీసులకు సమాచారం అందించి, డెడ్‌బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ పోస్ట్‌మార్టం కోసం బీకే ఆసుపత్రికి తరలించారు. కాగా, పంకజ్ ఒక వ్యాపారవేత్త. ఐదు నెలలుగా జిమ్‌కు వెళ్తున్నారని స్థానికులు చెప్పారు.
Read also- Trapit Bansal: టాలెంట్ కింగ్.. రూ.853 కోట్ల బోనస్‌తో జాబ్ ఆఫర్!
జిమ్‌కి వెళ్లే యువతా.. ఇవి గమనించండి
జిమ్‌కి వెళ్లే వారు గుండెపోటు ముప్పు నుంచి బయటపడేందుకు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. జిమ్‌కు వెళ్లే ముందు ఆరోగ్య పరిస్థితిని సంపూర్ణంగా చెక్ చేసుకోవాలి. ఈసీబీ, ఎకో, లిపిడ్ ప్రొఫైల్, బీపీ, షుగర్, థైరాయిడ్ లాంటి పరీక్షలు ముఖ్యమైన పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యం. కుటుంబ వారసత్వంలో ఎవరికైనా గుండె సమస్యలు ఉంటే, జిమ్‌కు వెళ్లే విషయంలో తప్పనిసరిగా కార్డియాలజిస్ట్‌ను సంప్రదించాలి. ఇక, వార్మప్ లేకుండా ఎక్సర్‌సైజ్ చేయకూడదు. 5–10 నిమిషాలు తప్పనిసరిగా వార్మప్ చేయాలి. ఒక్కసారిగా వ్యాయామంలోకి దిగితే గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. అతి బరువులు, ఎక్కువ రిపిటేషన్లు చేయడం అంత క్షేమం కాదు. జిమ్‌కు వెళ్లేవారు స్టెరాయిడ్లు, ప్రీ-వర్కౌట్స్, ఫాట్ బర్నర్స్ మితిమీరి ఉపయోగించడం మంచిది కాదు. గుండె పనితీరును దారుణంగా దెబ్బతీస్తుంది. ఇక, నిద్ర, ఆహారం సరిపడా ఉండాలి. వర్కౌట్ చేసేటప్పుడు ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరి ఆడకపోవడం, విపరీతమైన అలసట, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎక్స్‌ర్‌సైజ్ ఆపివేయాలి. జిమ్‌కు వెళ్లేవాళ్లు ప్రతి 6 నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకుంటే చాలా మంచిది.