Lions In Beach: గుజరాత్ లోని గిర్ అటవీ ప్రాంతం సింహాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. దేశంలో అత్యధిక సంఖ్యలో సింహాలను కలిగి ఉన్న ప్రాంతంగా ఇది గుర్తింపు పొందింది. గిర్ అటవీ ప్రాంతంలోని సింహాలు దశాబ్దాల కాలంగా అక్కడే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాయి. అయితే తాజా సర్వేలో అవి తమ స్థావరాలను మార్చుకున్నట్లు తేలింది. అధికారిక లెక్కల ప్రకారం గణనీయ సంఖ్యలో సింహాలు.. గుజరాత్ తీర ప్రాంతాలకు తరలివెళ్లిపోయాయి.
గణాంకాలు ఏం చెబుతున్నాయంటే?
2025 జనగణన లెక్కల ప్రకారం.. గుజరాత్ తీర ప్రాంతాల్లో 134 సింహాలు శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నాయి. 2015లో తీరప్రాంతంలో కేవలం 10 సింహాలే ఉండగా.. 2025 నాటికి ఈ సంఖ్య 134కి చేరింది. 1995లో తొలిసారి తీరప్రాంతంలో ఒక సింహం కనిపించగా.. 2020 నాటికి వాటి సంఖ్య 100కు చేరింది. ఆ తర్వాత 5 సంవత్సరాల్లో 34% పెరుగుదల చోటుచేసుకోవడం గమనార్హం. 2023లో అటవీ అధికారి పరవీన్ కస్వాన్ గుజరాత్ బీచ్‌లో సింహం సంచరిస్తున్న వీడియోను పంచుకోగా.. అప్పట్లో అది పెద్ద ఎత్తున వైరల్ గా కూడా మారింది.
I don’t know what is going in his life. But seems serious. Lion king enjoying Arabian Sea waves. Shared by good friend Akshay Joshi. pic.twitter.com/k26pCbsW34
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 2, 2023
కారణం ఏంటీ?
అడవిని విడిచి తీర ప్రాంతాల వైపు సింహాలు మెుగ్గు చూపడానికి గల కారణాలను నిపుణులు విశ్లేషించే ప్రయత్నం చేశారు. తీరప్రాంతం.. సింహాల జీవనానికి కావాల్సిన వాతావరణం, విస్తారమైన స్థలం, సరిపడినంత ఆహారాన్ని అందిస్తోందని అభిప్రాయపడ్డారు. అందుకే ఆడ సింహాలు.. మగవాటిపై ఒత్తిడి తీసుకొచ్చి తీరం వైపు వెళ్లేలా చేస్తుండొచ్చని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అవి తీరాల వైపునకు తరిలిపోతున్నట్లు అంచనా వేశారు. ఇదిలా ఉంటే తీర ప్రాంతాల్లో సింహాల నివాస ప్రాంత పరిధి గతంతో పోలిస్తే భారీగా పెరిగినట్లు తాజా అధ్యయనంలో తేలింది.
తీరాల్లో తెగ తిరిగేస్తున్న సింహాలు..
సాధారణంగా గిర్ అటవీ ప్రాంతంలో నివసించే ఒక సింహం సగటున 33.8 చ.కి.మీ. వరకు సంచరిస్తుంది. కానీ తీరప్రాంత సింహాలు ఏకంగా 171.8 చ.కి.మీ. వరకు వాటి పరిధిని విస్తరించుకున్నాయి. ముఖ్యంగా ఆడ సింహాలు మగ సింహాల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నాయి. పెద్ద ఆడ సింహాలు సగటున 214.8 చ.కి.మీ. వరకు కదులుతుండగా.. మగ సింహాలు 193.9 చ.కి.మీ. కవర్ చేస్తున్నాయి.
Also Read: CM Revanth Reddy: ఈ నెల 5నాటికి జడ్పీటీసీ అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి
తీరంలోని మెుక్కలతో మమేకమై
తీరప్రాంతంలో నివసించే సింహాలు.. ప్రాసోపిస్ జూలిఫ్లోరా వంటి మొక్కలతో మమేకమై ప్రశాంతంగా జీవిస్తున్నట్లు తాజా రిపోర్ట్ పేర్కొంది. తీరాల్లో నివసించే అడవి పందులు సింహాలకు ఆహారంగా మారిపోయాయని పేర్కొంది. ‘డైటరీ ప్యాటర్న్ ఆఫ్ ఆసియాటిక్ లయన్స్ ఇన్ ది కోస్టల్ ఎకోసిస్టమ్ ఆఫ్ సౌరాష్ట్ర, గుజరాత్, ఇండియా’ అనే అధ్యయనం.. 160 సింహాల ఆహారపు అలవాట్లను విశ్లేషించింది. అందులో తీరప్రాంత సింహాలు ఆరు ప్రధాన జంతువులపై ఆధారపడుతున్నాయని తేలింది. ఇప్పటివరకు ఇవి 74 నీల్గైలు (ఆసియాలోనే అతిపెద్ద జింక), 32 అడవి పందులు, 23 ఎద్దులు, 16 గేదెలు, 14 మేకలు, 4 జింకలు, ఒక పక్షిని వేటాడినట్లు రికార్డు చేశారు.