Indian Railways: కొందరు మనుషుల్లో మానవత్వం నానాటికి అడుగంటుతోంది. తోటి వారికి సాయం చేయాల్సిన పరిస్థితుల్లోనూ వారిని ఎగతాళి చేస్తూ ఆనందిస్తున్న సంస్కృతి క్రమంగా పెరుగుతోంది. తాజాగా దీనికి అద్దం పట్టే ఘటన ఓ రైల్వే స్టేషన్ లో జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కష్టాల్లో ఉన్న యువతికి సాయం చేయడానికి బదులుగా కొందరు స్థానికులు వ్యవహరించిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనపై రైల్వే వర్గాలు సైతం స్పందించాయి.
అసలేం జరిగిందంటే?
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న దానిపై క్లారిటీ లేదు. అయితే వీడియోను గమనిస్తే.. ఓ రైలు స్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ పై ఆగి ఉంది. రైలులోని ఓ బోగి ప్రయాణికులతో కిక్కిరిసిపోవడంతో అందులోని ఒక యువతికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిపోయింది. చాలా నిరసంగా కనిపిస్తూ శ్వాస అందక అల్లాడిపోయింది. అయితే యువతి పరిస్థితి గమనించిన ఫ్లాట్ ఫామ్ మీద ఉన్న కొందరు వ్యక్తులు.. ఆమెకు సాయం చేయాల్సింది పోయి సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. ఆమె బాధను చూసి నవ్వుతూ వీడియోలు తీయడం ప్రారంభించారు. దీనిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది.
రైల్వేశాఖకు ట్యాగ్
రైలులో యువతి ఇబ్బంది పడుతున్నప్పటికీ ఏమాత్రం పట్టనట్లు ప్రవర్తించిన స్థానికుల వీడియోను ఓ నెటిజన్ రైల్వేశాఖకు ట్యాగ్ చేశాడు. ‘ఒక అమ్మాయి రైలు బోగీలో నలిగిపోతూ ఊపిరి ఆడక తంటాలు పడుతోంది. ప్లాట్‌ఫామ్ మీద ఉన్న జనాలు నవ్వుతూ ఎగతాళి చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తనను ఏమని పిలుస్తారు?’ యూజర్ ప్రశ్నించారు. ఈ వీడియోను రైల్వేమంత్రిత్వశాఖతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వేసేవా అకౌంట్ కు ట్యాగ్ చేశారు. పండుగ సీజన్ లో జనసందోహాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్కువ రద్దీ ఉన్న స్టేషన్లలో ప్రవేశాన్ని పరిమితం చేసి, సీఆర్‌పీఎఫ్ వంటి భద్రతా సిబ్బందిని మోహరించాలని సూచనలు చేశారు.
A girl was almost suffocated stampeded into a train coach and she was running out of breath.
The crowd on the platform was laughing and mocking her.
What do you call such behavior?
Dear @AshwiniVaishnaw Ji @RailMinIndia @RailwaySeva
Every festival the surge at railway… pic.twitter.com/1UICJwx9YZ
— Woke Eminent (@WokePandemic) August 11, 2025
స్పందించిన రైల్వేశాఖ
నెటిజన్ ట్యాగ్ చేసిన వీడియోపై రైల్వే శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘రైల్వే సేవా’ ఎక్స్ ఖాతా స్పందించింది. ఘటన పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇది చూసి మాకు ఆందోళన కలిగింది. దయచేసి ఘటన స్థలం, తేదీ, మొబైల్ నంబర్ వంటి వివరాలు షేర్ చేయండి. తద్వారా మేము పరిశీలించగలము. అలాగే మీరు నేరుగా https://railmadad.indianrailways.gov.in లో మీ సమస్యను నమోదు చేస్తే త్వరిత పరిష్కారం లభిస్తుంది’ అని రిప్లై ఇచ్చింది.
నెటిజన్లు ఫైర్..
కిక్కిరిసిన రైలులో బాధపడుతున్న యువతి పట్ల నిర్దయగా ప్రవర్తించిన తోటి ప్రయాణికులపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనిని అమానవీయ ఘటనగా అభివర్ణిస్తున్నారు. ‘అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి అనే అవగాహన కూడా చాలా మందికి ఉండటం లేదు’ అని ఓ నెటిజన్ అన్నాడు. ‘తోటి ప్రయాణికులు అలా ప్రవర్తించడం సిగ్గుచేటు’ అని ఇంకొకరు కామెంట్ చేశారు. మరొకరు స్పందిస్తూ ‘ఈ జనాలకు ఏమైందో. వారిలో చాలామంది యువకులు చదువుకున్నవారు. వారు ఇలా ప్రవర్తించడం దురదృష్టకరం’ అని రాసుకొచ్చారు.