Hormones Imbalance: మహిళల భావోద్వేగాలను నియంత్రించడంలో హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. హార్మోన్ల అసమతుల్యత.. స్త్రీల మానసిక ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆందోళన, అశాంతి, డిప్రెషన్ వంటి సమస్యలకు దారితీయవచ్చని పేర్కొంటున్నారు. ఇంతకీ మహిళల శరీరంలోని ముఖ్యమైన ఐదు హార్మోన్లు ఏవి? ప్రయోజనాలు ఏంటీ? వాటి అసమతుల్యత వల్ల కలిగే మార్పులు ఏవి? ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈస్ట్రోజెన్
ఈస్ట్రోజెన్ (Estrogen) అనేది సెరోటోనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన హార్మోన్. శరీరంలో సెరోటోనిన్ స్థాయులు ఎంత ఎక్కువగా ఉంటే స్త్రీలు అంత ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు. అయితే ఈస్ట్రోజెన్ స్థాయులు తక్కువగా ఉన్నప్పుడు సెరోటోనిన్ ఉత్పత్తి కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. దీనివల్ల స్త్రీలలో ఆందోళన, చిరాకు, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఉదాహరణకు రుతుస్రావం, గర్భం లేదా మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజెన్ స్థాయిలలో హెచ్చుతగ్గులు.. మానసిక స్థితిలో మార్పులను కలిగిస్తాయి.
ప్రొజెస్టెరోన్
ప్రొజెస్టెరోన్ (Progesterone) అనేది మానసిక స్థితిని శాంతపరిచే హార్మోన్. ఇది గాబా అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌తో సంబంధం కలిగి ఉంటుంది. అది ఆందోళనను తగ్గిస్తుంది. ప్రొజెస్టెరోన్ స్థాయిలు తగ్గినప్పుడు ఉదాహరణకు గర్భం తర్వాత లేదా ప్రీమెన్‌స్ట్రువల్ డిస్ఫోరిక్ డిజార్డర్ (PMDD) సమయంలో ఇది స్త్రీలలో చిరాకు, భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది.
థైరాయిడ్ హార్మోన్లు
థైరాయిడ్ గ్రంథి ఈ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా T3 (ట్రైయోడోథైరోనిన్) మహిళల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. థైరాయిడ్ హార్మోన్లు తక్కువగా ఉన్నప్పుడు (హైపోథైరాయిడిజం) అది డిప్రెషన్, అలసటకు దారితీస్తుంది. అధికంగా ఉన్నప్పుడు (హైపర్‌థైరాయిడిజం) ఆందోళన, చిరాకు పెరుగుతాయి.
కార్టిసాల్ లేదా స్ట్రెస్ హార్మోన్
కార్టిసాల్ ను స్ట్రెస్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. కార్టిసాల్ స్థాయిలు అధికంగా ఉన్నప్పుడు ఆందోళన, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తరుచూ ఒత్తిడికి గురయ్యేవారిలో కార్టిసాల్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది మానసిక ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
టెస్టోస్టెరోన్
టెస్టోస్టెరోన్.. పురుషులలో ప్రధాన హార్మోన్ అయినప్పటికీ స్త్రీలలో కూడా ఉంటుంది. తక్కువ టెస్టోస్టెరోన్ స్థాయులు.. డిప్రెషన్, ఏకాగ్రత కొరత, ఒత్తిడిని నిర్వహించడంలో ఇబ్బందులకు దారితీస్తాయి. ఈ హార్మోన్ అసమతుల్యత పురుషులు, స్త్రీలు ఇద్దరిలోనూ మానసిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
Also Read: Shane Tamura: అమెరికాలో కాల్పులు.. కిల్లర్ మాములోడు కాదు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
నివారణ మార్గాలు..
హార్మోన్ల అసమతుల్యతకు చెక్ పెట్టి.. మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ముందుగా శరీరంలోని హర్మోన్ల స్థాయులను పరీక్షించుకోవాలని చెబుతున్నారు. ఏదైనా హార్మోన్ అవసరాని కంటే తక్కువగా ఉంటే వైద్యుడి ద్వారా హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ (HRT) చేయించుకోవాలని సూచిస్తున్నారు. అటు రోజువారీ వ్యాయామం, సమతుల్య ఆహారం, ఒత్తిడి నివారణ టెక్నిక్స్ (యోగా, ధ్యానం), తగినంత నిద్ర.. హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read This: Nimisha Priya Case: నిమిష ప్రియకు భారీ ఊరట.. ఫలించిన చర్చలు.. మరణశిక్ష రద్దు!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.