Dogs chasing vehicles: కుక్కలను పెంచుకోవడం అనేది చాలా మందికి ఇష్టమైన అలవాటు. ఎందుకంటే, ఇతర జంతువులతో పోలిస్తే కుక్కలు అసాధారణమైన విశ్వాసాన్ని చూపిస్తాయి. వేల నుంచి లక్షల రూపాయల వరకు కుక్కలను కొనుగోలు చేసిన యజమానులు వాటిని ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా చూసుకుంటారో మనకి కూడా తెలిసిందే.
కుక్కలు, వాహనాలను అందుకే వెంబడిస్తాయో తెలుసా?
అయితే, కుక్కలు కదిలే వాహనాలను వెంబడించడం మనం తరచూ చూస్తుంటాం. మనుషులను గుర్తించడం సరే, కానీ వాహనాలను కూడా కుక్కలు ఎలా గుర్తిస్తాయనే ప్రశ్న ఎప్పుడైనా మీ మదిలో మెదిలిందా? నిజమే, కుక్కలు వాహనాలను కూడా గుర్తుపడతాయి. ఒక వాహనం తమ ప్రాంతానికి చెందినదా కాదా, లేదా దాన్ని మళ్లీ గుర్తించాలనుకుంటే, కుక్కలు ఆ వాహనం టైర్లపై మూత్ర విసర్జన చేస్తాయి. ఈ వాసన ద్వారా వాహనాన్ని గుర్తుపట్టి, అది సురక్షితమైనదని భావిస్తాయని జంతు వైద్య నిపుణులు చెబుతున్నారు.
కుక్కలకు ఆ శబ్దాలు నచ్చవా?
అదే సమయంలో, ఏదైనా కొత్త వాహనం కనిపిస్తే.. అది తమ ప్రాంతానికి చెందనిదని తెలిస్తే, కుక్కలు వెంటనే మొరగడం మొదలెడతాయి. కొత్త వ్యక్తులను చూసినప్పుడు మొరిగే విధంగానే, కొత్త వాహనాలను చూసినప్పుడు కూడా తమకు లేదా తమ ప్రాంతంలోని వారికి ఏదైనా ప్రమాదం జరగొచ్చనే ఊహతో వాటిని వెంబడిస్తాయి. శాస్త్రవేత్తలు కుక్కలపై చేసిన పరిశోధనల ప్రకారం, కొన్నిసార్లు కుక్కలు సరదాగా లేదా టైమ్‌పాస్ కోసం కూడా వాహనాలను వెంబడిస్తాయట. ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఆటలు ఆడాలనిపించినప్పుడు, వాహనాలను వెంబడించడం ద్వారా నీరసం పోయి, సంతోషంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే.. వాహనాలు చేసే బిగ్గరగా శబ్దాలు కుక్కలకు నచ్చకపోవడం. ఈ శబ్దాలకు భయపడి, లేదా అవి తమకు అసౌకర్యంగా అనిపించడం వలన కూడా కుక్కలు వాహనాలను వెంబడిస్తాయని నిపుణులు అంటున్నారు.
మనుషులు వినలేని చిన్న చిన్న శబ్దాలను కూడా అవి స్పష్టంగా వినగలవు. అందుకే, వాహనాల నుంచి వచ్చే పెద్ద శబ్దాలు కుక్కలకు ఇబ్బంది కలిగించి, వాటిని వెంబడించేలా ప్రేరేపిస్తాయి. కాబట్టి, విశ్వాసంతో పాటు తెలివితేటలు, ఆటపట్టించే స్వభావం కలిగిన కుక్కలు వాహనాలను వెంబడించడం వలన తమ ప్రాంతాన్ని, తమను తాము రక్షించుకుంటూ, కొన్నిసార్లు సరదాగా కూడా గడుపుతాయని నిపుణులు చెబుతున్నారు.