DMK MP: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీకి చెందిన కీలక నేతకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ పార్టీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి ఎ. రాజా (A. Raja) ఓ వేదికపై మాట్లాడుతున్న క్రమంలో భారీ లైట్ స్తంభం ఒక్కసారిగా ఆయన వైపునకు కుప్పకూలింది. ఎంపీ వెంటనే అలర్ట్ అయ్యి పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
వివరాల్లోకి వెళ్తే
రాష్ట్రంలోని మైలాదుతురై ప్రాంతంలో అధికార డీఎంకే.. ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. సీఎం స్టాలిన్ (CM Stalin) పుట్టిన రోజు వేడుకలతో పాటు గవర్నర్ విషయంలో సాధించిన న్యాయ విజయానికి సంకేతంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి ఆ పార్టీ ఎంపీ రాజా హాజరయ్యారు. భారీగా వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
కుప్పకూలిన లైట్ స్టాండ్
అయితే ఎంపీ మాట్లాడుతున్న సమయంలో సభా ప్రాంగణాన్ని పెద్ద సుడిగాలి చుట్టేసింది. దీంతో ఎంపీ పోడియంకు ఎదురుగా ఉన్న స్టీల్ రాడ్, దానికి అమర్చిన బరువైన లైట్ ఒక్కసారిగా స్టేజీ పైకి కుప్పకూలయి. ఇది గమనించిన ఎంపీ.. వెంటనే పక్కకు తప్పుకున్నారు. లైట్ నేరుగా ఎంపీ మాట్లాడుతున్న మైక్ పై పడటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
తమిళనాడు డీఎంకే ఎంపీకి తప్పిన ప్రమాదం
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో డీఎంకే ఎంపీ రాజా ప్రసంగిస్తున్న సమయంలో గాలిదుమారానికి వేదిక పై పడ్డ లైటింగ్ స్తంభం.
అయితే అది గమనించి ఎంపీ వేగంగా పక్కకు తప్పుకోవడంతో తప్పిన ప్రమాదం. pic.twitter.com/EurL4pdL2a— ChotaNews App (@ChotaNewsApp) May 5, 2025
ఉలిక్కిపడ్డ సభా ప్రాంగణం
బలమైన గాలుల ద్వారానే లైట్ స్టాండ్ అలా పడిపోయిందని డీఎంకే నేతలు (DMK Politicians) తెలియజేస్తున్నారు. అయితే మైక్ కూలిన సమయంలో సభలోని వారంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అటు వేదికపై ఉన్న డీఎంకే నేతలు సైతం ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా ఎంపీ వద్దకు పరిగెత్తుకొని వెళ్లారు. అయితే ఎ. రాజాకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు జాతీయ స్థాయిలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.