Boy Swallows Gold: పిల్లలు ఆడుకునేటప్పుడు జాగ్రత్తలు మరిచిపోవడం సహజం. కొన్నిసార్లు చిన్నచిన్న వస్తువులు, నాణేలు, బటన్లు, పిన్‌లు వంటి వాటిని నోటిలో వేసి మింగేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చైనాలో వెలుగుచూసింది. 11 ఏళ్ల వయసున్న ఓ పిల్లాడు ఏకంగా బంగారం బిల్లను (Boy Swallows Gold) మింగేశాడు. దానితో ఆడుకుంటూ పొరపాటున మింగాడు. అక్టోబర్ 17న 10 గ్రాముల బరువున్న బంగారం బిల్లను కొనుక్కొని రాగా, నాలుగు రోజుల తర్వాత అక్టోబర్ 22న మింగేశాడు. బిల్లను నోటిలో పెట్టుకొని తన నాలుక సామర్థ్యాన్ని పరీక్షించుకుంటున్న సమయంలో పొరపాటున జారి నోటిలోకి వెళ్లిపోయింది. చైనాలోని ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న జియాంగ్సు ప్రావిన్స్, కున్షాన్ నగరంలో ఈ ఘటన జరిగింది.
Read Also- Konda Surekha: రాష్ట్రానికి తలమానికంగా నర్సాపూర్ అర్బన్ ఎకో పార్క్: మంత్రి కొండా సురేఖ
బంగారం బిల్ల కొత్తది కావడంతో దానితో ఆడుకున్నాడని బాలుడి తల్లి జీ (ఇంటి పేరు, అసలు పేరు వెల్లడించలేదు) తెలిపింది. బంగారు బిల్ల మలం ద్వారా బయటకు వచ్చేంత వరకు బయటకు వెళ్లొద్దని బాలుడికి అతడి తల్లి సూచించింది. చాలా ఖరీదైనది కావడంతో ఆమె ఈ సూచన చేసింది. తాను బాల్కనీలో దుస్తులు ఉతకుతున్న సమయంలో పిల్లాడు పరిగెత్తుకుంటూ తన వద్దకు వచ్చాడని, భయంతో మాట్లాడుతూ బంగారం బిల్లను మింగేశానని చెప్పినట్టు ఆమె పేర్కొంది. చనిపోతానేమోనని భయపడ్డాడని ఆమె తెలిపింది. తన కొడుకు అబద్ధం చెబుతున్నాడేమోనని జీ అనుకుంది, కానీ ఆ బంగారు బిల్ల కనిపించకపోవడంతో ఆమె ఆందోళన చెందింది. గతంలో తన మేనకోడలు కూడా ఇదే విధంగా నాణేన్ని మింగడం, హాస్పిటల్‌కు తీసుకువెళ్లగా, అదేమీ ప్రమాదం కాదని డాక్టర్లు చెప్పిన విషయం గుర్తొచ్చి ఆమె టెన్షన్ తగ్గించుకుంది. అప్పటిమాదిరిగానే మలం ద్వారా బయటకు వస్తుందని భావించింది. దీంతో, విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆన్‌లైన్‌లో కూడా దీనికి సంబంధించిన వివరాలు చూసి, మలం ద్వారా బయటకు వస్తుందని తెలుసుకొని రిలాక్స్ అయింది.
Read Also- Warangal District: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గన్ కల్చర్.. భయంతో జనాలు ఉక్కిరిబిక్కిరి..!
ఆ బిల్ల బయట పడేదాకా మలవిసర్జనకు బయటకు వెళ్లవద్దని బాలుడికి ఆమె సూచించింది. కానీ, ఐదు రోజులు వరుసగా రోజుకు రెండుసార్లు చెక్ చేసినప్పటికీ, బంగారం కనిపించలేదు. దీంతో, అక్టోబర్ 26న తన కొడుకుని వెంటబెట్టుకొని ఒక హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. టెస్టులు చేయగా ఆ బాలుడి కడుపులోనే ఆ బంగారు బిల్ల ఉన్నట్టు గుర్తించారు. అయితే, బాలుడికి కడుపులో నొప్పి రాలేదు. వాంతులు వంటి అనారోగ్య లక్షణాలు కూడా లేవు. ఆ మరుసటి రోజున కడుపులోంచి బంగారం బిల్ల బయటకొచ్చినట్టు తెలిసిందని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ పేర్కొంది. అయితే, ఏవిధంగా బయటకు తీసేశారని విషయాన్ని వెల్లడించలేదు. అది సహజంగా బయటకు వచ్చిందా, లేక వైద్య ప్రక్రియ ద్వారా బయటకు తీశారా అనేది పేర్కొనలేదు. కాగా, ఈ బంగారం బిల్ల విలువ విలువ 1,406 డాలర్లు. అంటే, భారతీయ కరెన్సీలో సుమారు రూ.1.17 లక్షల వరకు ఉంటుంది.
