Street Dogs benefits: సాధారణంగా కుక్కలంటే చాలా మందికి ఇష్టమే. మనుషుల పట్ల అవి చూపించే ప్రేమ, విశ్వాసం చాలా మందిని ముగ్దులను చేస్తుంటాయి. అందుకే చాలా మంది కుక్కలను పెంచుకుంటూ తమ ఇంట్లో ఒక సభ్యునిగా ట్రీట్ చేస్తుంటారు. అయితే వీధి కుక్కల విషయంలో మాత్రం చాలా మందిలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అవి ఉండే పరిస్థితుల దృష్ట్యా వాటిపై వ్యక్తుల అభిప్రాయాలు మారిపోతుంటాయి. అందుకే వీధి శునకాలను కొందరు దగ్గరకు సైతం రానివ్వరు. అయితే వాటి వల్ల సమాజానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతున్నట్లు తాజా సర్వే పేర్కొంది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
నేరాల నియంత్రణ
వీధి శునకాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో నేరాల సంఖ్య చాలా పరిమితంగా ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా దొంగలు.. కుక్కలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చోరీలకు పాల్పడేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నట్లు తేలింది.
భద్రతకు భరోసా
సాధారణంగా కుక్కలు లేని ప్రాంతాలతో పోలిస్తే అవి అధికంగా ఉండే ఏరియాల్లో ప్రజలు కాస్త సేఫ్ గా ఫీలవుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. కొత్త ముఖాలు వీధుల్లో కనిపిస్తే.. వెంటనే అరవటం ద్వారా అవి చుట్టుపక్కల వారిని అలెర్ట్ చేస్తున్నట్లు తేలింది.
చైన్ స్నాచింగ్
ఇటీవల కాలంలో నగరంలో పెద్ద ఎత్తున చైన్ స్నాచింగ్ ఘటనలు ఎక్కువయ్యాయి. అయితే వీధి శునకాలు ఉన్న ఏరియాలో మహిళల మెడలో గొలుసు దొంగిలించడం అంత తేలిగ్గా ఉండటంలేదని తేలింది. మోటార్ సైకిల్స్ ఏదైనా వేగంగా కదులుతున్నట్లు కనిపిస్తే శునకాలు వెంటనే అప్రమత్తమై వాటి వెంట పడుతున్నాయి. దీంతో ఆ వీధుల్లోకి చైన్ స్నాచర్లు వెళ్లడం లేదని సమాచారం.
వాటి బెడద తక్కువ
శునకాలు అధికంగా ఉండే ఏరియాలో పిల్లుల సంచారం తక్కువగా ఉంటోంది. దీనివల్ల ఇళ్లల్లో పాలు, పెరుగు వంటివి పిల్లుల పాలు కాకుండా భద్రంగా ఉంటున్నట్లు తాజా సర్వేలో స్పష్టమైంది.
Also Read: Ap Govt Research Results: ఏపీలోని ఆ జిల్లాలు వెరీ డేంజర్.. వెలుగులోకి సంచలన నిజాలు..
వీధి శునకాల వల్ల నష్టాలు
వీధుల్లో ఉండే కుక్కల వల్ల ప్రయోజనాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులపై అవి తరుచూ దాడి చేస్తూ ఉండటం.. చాలా ఏరియాలో ప్రధాన సమస్యగా మారుతోంది. వీధి కుక్కల బారిన పడి పలువురు పిల్లలు మరణించిన ఉదంతాలు తరుచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి వీధి శునకాలు మీ ఏరియాలో అధికంగా ఉంటే కచ్చితంగా మున్సిపాలిటీ అధికారులు సమాచారం ఇవ్వాల్సిందే.