Apple Watch: ప్రస్తుత యుగంలో టెక్నాలజీ మనుషుల జీవితాల్లో మమేకమై పోయింది. ఈ సాంకేతికత కారణంగా కొన్ని దుష్ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ఓ యాపిల్ వాచ్ ఏకంగా ఒక యువకుడి ప్రాణాలను కాపాడింది. అది కూడా సముద్ర గర్భంలో ఉన్నప్పుడు అతడ్ని రక్షించింది.
అసలేం జరిగిందంటే?
ముంబయికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ క్షితిజ్ జోడాపే (Kshitij Zodape).. విహారయాత్ర కోసమని పుదుచ్చేరికి వెళ్లాడు. అక్కడి సముద్రంలో స్కూబా డైవింగ్ చేద్దామని భావించి.. ట్రైనర్ సాయంతో నీటిలోకి దిగాడు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న విపత్కర పరిణామాలను అతడు సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. దీని ప్రకారం.. అతడు సముద్రంలో దిగినప్పుడు అలల తాకిడి చాలా అధికంగా ఉంది. దీంతో విజిబిలిటీ కేవలం 5-10 మీటర్ల వరకూ మాత్రమే ఉందని క్షితిజ్ తెలిపాడు.
వార్నింగ్ సైరెన్
సముద్రంలో 36 మీటర్ల లోతుకు వెళ్లిన తర్వాత ప్రవాహం తీవ్రతకు ఒక్కసారిగా తన వెయిట్ బెల్ట్ (weight belt) ఊడిపోయినట్లు క్షితిజ్ తెలిపాడు. దీంతో అత్యంత వేగంగా ఉపరితలానికి దూసుకెళ్తున్నట్లు అనిపించిందని చెప్పాడు. తన వేగాన్ని నియంత్రించుకోవడంలో తాను విఫలమైనట్లు పేర్కొన్నాడు. ఆ సమయంలో చేతి మణికట్టుకు ఉన్న యాపిల్ వాచ్ అల్ట్రా వెంటనే అప్రమత్తమైనట్లు చెప్పాడు. అంత వేగంగా వెళ్తే ఊపిరితిత్తులు దెబ్బతింటాయని హెచ్చరించినట్లు పేర్కొన్నాడు. సడన్ అసెంట్ (vertical ascent) ను గుర్తించి వార్నింగ్ సైరెన్ మోగించిందని చెప్పాడు.
సాయం చేసిన ఇన్ స్ట్రక్టర్
నీటి అడుగున వినిపించే ఇతర శబ్దాల కంటే భిన్నంగా యాపిల్ వాచ్ అలెర్ట్ సైరన్ మోగించిందని క్షితిజ్ తెలిపాడు. దీంతో శబ్దం డైవింగ్ ఇన్ స్ట్రక్టర్ చెవిని తాకిందని.. ఆయన వెంటనే వెనక్కి ఈదుకుంటూ తన వద్దకు వచ్చి సహాయం చేశాడని క్షితిజ్ చెప్పుకొచ్చాడు. అప్పటికే తాను 10 మీటర్ల వరకు వేగంగా పైకి వెళ్లిపోయినట్లు తెలిపాడు. అయితే అలెర్ట్ సైరన్ మోగేవరకూ యాపిల్ వాచ్ లో ఇలాంటి ఫీచర్ ఉన్న విషయం తనకు తెలియదని క్షితిజ్ పేర్కొన్నాడు.
Also Read: Dussehra Liquor Sales: దసరా వేళ ఏరులై పారిన మద్యం.. గత రికార్డులు బద్దలు.. ఇలా తాగేశారేంట్రా బాబు!
యాపిల్ సీఈఓ స్పందన
యాపిల్ వాచ్ తన ప్రాణాలను కాపాడిన విషయాన్ని క్షితిజ్ ఆ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ దృష్టికి తీసుకెళ్లాడు. కుక్ దీనిపై స్పందిస్తూ ‘మీ ఇన్‌స్ట్రక్టర్ ఆ అలారం విని వెంటనే మీకు సహాయం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీ కథను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. జాగ్రత్తగా ఉండండి’ అని సమాధానం ఇచ్చారు. కాగా, 2022లో విడుదలైన ఆపిల్ వాచ్ అల్ట్రా.. కఠినమైన సాహసాలకు సరిపోయే విధంగా రూపొందించబడింది. ఇందులో ఎమర్జెన్సీ సైరన్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
