Thai Women: థాయిలాండ్ లో ఓ కిలేడీ రెచ్చిపోయింది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే బౌద్దులను టార్గెట్ చేసి వారికి వలపు వల విసిరింది. తద్వారా 80,000 ప్రైవేటు వీడియోలు, ఫొటోలు తీసి సన్యాసులను బ్లాక్ మెయిల్ చేసింది. ఓ వ్యక్తి సన్యాసానికి దూరం కావడం, దానిపై పోలీసులు దృష్టిసారించడంతో మహిళ బండారం బయటపడింది. ప్రస్తుతం ఈ లైంగిక కుంభకోణం ఘటన.. థాయిలాండ్ సహా యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అసలేం జరిగిందంటే?
బ్యాంకాక్ (Bangkok) కు చెందిన 30 ఏళ్ల విలావన్ ఎమ్సావత్ (Wilawan Emsawat) ను నోంథాబురి (Nonthaburi)లోని ఆమె విలాసవంతమైన ఇంట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. కనీసం తొమ్మిది మంది బౌద్ధ సన్యాసులతో (Buddhist leaders) లైంగిక సంబంధాలు పెట్టుకొని వారిని బ్లాక్ మెయిల్ చేసిన ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇంట్లో అధికారులు సోదాలు చేయగా 80,000 కంటే ఎక్కువ లైంగిక వీడియోలు, ఫొటోలు పోలీసులకు లభించాయి. గత మూడేళ్లలో ఆమె బ్యాంక్ ఖాతాలో 385 మిలియన్ బాట్ ( దాదాపు రూ.102 కోట్లు) జమ అయినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ డబ్బును ఆన్ లైన్ జూదంలో ఎక్కువగా ఖర్చు చేసినట్లు తేలింది.
సీక్రెట్స్ తెలుసుకొని..
విలావన్ ఎమ్సావత్.. సోషల్ మీడియా (Social Media) ద్వారా బౌద్ద సన్యాసులను సంప్రదించినట్లు దర్యాప్తులో తేలింది. వారితో లైంగిక సంబంధాలు పెట్టుకొని సన్యాసుల రహస్యాలు, సన్నిహితంగా ఉన్న ఫొటోలను తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గర్భవతిని అయ్యానని చెప్పి ఓ సన్యాసి దగ్గర ఏకంగా 7.2 మిలియన్ బాట్ (సుమారు రూ. 1.65 కోట్లు) తీసుకుందని పోలీసులు తెలిపారు. అతడ్ని మభ్యపెట్టినట్లే మరికొంతమంది సన్యాసులతోనూ ఇదే విధంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం విలావన్ పై బ్లాక్‌మెయిల్, మనీ లాండరింగ్, దొంగిలించిన వస్తువుల స్వీకరణ ఆరోపణల కింద సెక్షన్లు నమోదు చేసినట్లు వివరించారు.
బౌద్ద సన్యాసులపై వేటు
విలావన్ లైంగిక కుంభకోణం వెలుగుచూడటంతో బాధితులు.. తమ సన్యాసుల హోదారను కోల్పోయారు. ఆమెతో సంబంధం ఉన్న మరికొందరు దాక్కున్నారు. ఈ ఘటన థాయిలాండ్ లోని బౌద్ధ సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందన్న ప్రచారం జరుగుతోంది. బౌద్దులతో సంబంధాలు పెట్టుకునే మహిళలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. లైంగిక స్కామ్ ఘటనపై థాయిలాండ్ తాత్కాలిక ప్రధాని ఫుంథమ్ వెచ్చయ్యచై (Phumtham Wechayachai) స్పందించారు. బౌద్ద ఆలయాలు, సన్యాసుల పారదర్శకత కోసం కఠిన చట్టాలు అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
Also Read: Jogulamba Gadwal district: ఇంటి పన్ను కట్టించుకుంటున్నారు.. కాని మంచి నీళ్ల గురించి పట్టించుకోరా?
90 శాతం బౌద్దులే!
థాయిలాండ్ లో 90% కంటే ఎక్కువ మంది బౌద్ధులు (Buddhists) ఉన్నారు. దాదాపు 2 లక్షల మంది సన్యాసులు, 85 వేల మంది నోవిస్ లు ఉన్నారు. అయితే సన్యాస దీక్ష చేపట్టిన వారు బ్రహ్మచర్యం పాటించడం తప్పనిసరి. అయితే థాయిలాండ్ లోని కొందరు బౌద్దులు మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం కొత్తేమి కాదని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఈ తరహా ఘటనలు తరుచూ వెలుగు చూస్తూనే ఉన్నాయని పేర్కొంది. అయితే తాజాగా భారీ లైంగిక కుంభకోణం వెలుగుచూడటంతో థాయిలాండ్ ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది.