Ponguleti srinivas reddy: రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరపై ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం మంత్రి, కూసుమంచి మండలంలో పర్యటించారు. ముందుగా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలోని గంగమ్మ తల్లి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని నాయకన్ గూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ఇందిరమ్మ రాజ్యంలో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పించామని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గడిచిన సంవత్సర కాలంలో 25 లక్షల 65 వేల మంది రైతన్నలకు 20 వేల 687 కోట్ల రూపాయలతో 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసామన్నారు.గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన రైతు బంధు నిధులను ప్రజా ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. దేశ చరిత్రలో మద్దతు ధరతో పాటు క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, గత వానాకాలం పంటకు దాదాపు 1700 కోట్ల రూపాయలు బోనస్ అందించామన్నారు.
Also read: Thummala Nageswara Rao: రైతన్నల కోసమే రైతు బజార్లు.. దళారి వ్యవస్థకు చెక్
యాసంగిలో కూడా సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లించి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు వరి పంటపై నియంత్రణ పెట్టాయని, ప్రజా ప్రభుత్వంలో మన రైతులు పండించిన ధాన్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రైతు భరోసా పెండింగ్ నిధులను త్వరలో రైతుల ఖాతాలలో జమ చేస్తామన్నారు.రాష్ట్రంలో నీటి సమస్య రాకుండా రైతుల పొలాలకు సాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు.
గత వానాకాలం పంట సమయంలో రికార్డు స్థాయిలో వరి పంట పండిందన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వానాకాలం, యాసంగి ధాన్యం మన రాష్ట్రంలో పండుతుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతన్నల దగ్గర నుంచి పంట కొనుగోలు చేస్తామని రైతులు ఎవరు అనవసర ఆందోళనకు గురి కావద్దన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వానాకాలం సీజన్ లో నాయకన్ గూడెంలోని 250 మంది రైతుల నుంచి 12 వేలకు పైగా క్వింటాళ్ల ధాన్యాన్ని మద్దతు ధరపై కోనుగోలు చేశామన్నారు. సన్న రకం ధాన్యానికి 500 రూపాయల బోనస్ అందించామన్నారు. మన జిల్లాలో పండించిన సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లించి కొనుగోలు చేసిన తర్వాత వాటిని రైస్ మిల్లుల ద్వారా బియ్యం చేసి ప్రజలకు ఉచితంగా రేషన్ సరఫరా చేస్తున్నామని, సంవత్సరానికి సరిపడా సన్న రకం బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
Also read: Naa Anvesh – HCU Land: నా అన్వేష్‌ను తెగ వాడేసిన బీఆర్ఎస్.. బిగ్ షాకిచ్చిన అన్వేష్..
మన జిల్లా రైతన్నల కృషి ఫలితంగా ఇతర జిల్లాలకు కూడా సన్న రకం బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు.యాసంగి పంట ఎండిపోకుండా మంత్రి ప్రత్యేకంగా పర్యవేక్షించారని, చివరి భూములకు నీరు అందేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.గత యాసంగి కంటే అధికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రెండు లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా ఉందన్నారు. చివరి గింజ వరకు మద్దతు ధరపై కొనుగోలు చేస్తామని రైతులు అనవసర వదంతులు నమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించాలన్నారు.