Naa Anvesh – HCU Land: హెచ్‌సీయూ భూముల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వక్రీకరించి, విద్యార్థులను ఉద్దేశించి ‘గుంటనక్కలు’ అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై యూట్యూబర్ అన్వేశ్ స్పందిస్తూ వాస్తవంగా భూ వివాదాన్ని రాజకీయంగా వాడుకునే వ్యక్తులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారని, విద్యార్థులను కాదని స్పష్టం చేశారు. అన్వేశ్ వివరణతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ వివాదం మరింత హైలెట్ అయింది. అసలు ఏం జరిగిందంటే..
ఇటీవల శాసనసభ సమావేశాల్లో హెచ్‌సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) భూముల విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి ప్రభుత్వ ఆస్తి అని, ఇది అభివృద్ధి ప్రాంతంలో ఉన్నందున దానిని సమర్థవంతంగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ భూముల చుట్టూ జరుగుతున్న వివాదంపై కూడా ఆయన స్పందించారు. “కొన్నిపార్టీల నాయకులు, బయటి వ్యక్తులు యూనివర్సిటీలోకి చొరబడి, గుంటనక్కల్లా గందరగోళం సృష్టిస్తున్నారు. వీరికి గుణపాఠం చెబుతాం” అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
Also Read: కేసీఆర్ వి పగటికలలే.. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఉండదు.. టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్
అయితే, సీఎం వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత కేటీఆర్ తప్పుగా అర్థం చేసుకున్నారో.. లేదా ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి చెప్పారో తెలియదు కానీ, ఈ మాటలు హెచ్‌సీయూ విద్యార్థులను ఉద్దేశించి చెప్పినట్లుగా ఇటీవల జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు విద్యార్థులను రెచ్చగొట్టేలా ఉన్నాయని, రేవంత్ రెడ్డి విద్యార్థుల పట్ల అగౌరవంగా వ్యవహరించారని కేటీఆర్ విమర్శించారు.
ఈ ఆరోపణలపై యూట్యూబర్ అన్వేశ్ స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన వీడియో, కేటీఆర్ ప్రెస్ మీట్ వీడియోలను చూపిస్తూ, ‘గుంటనక్కలు’ అనే పదం విద్యార్థులను ఉద్దేశించి కాకుండా, భూ వివాదాన్ని రాజకీయంగా వాడుకునే నాయకులు, ఇతర వ్యక్తులను సూచిస్తూ చెప్పారని అన్వేశ్ వివరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో చర్చ మరింత తీవ్రమైంది.
అన్వేశ్ వీడియోను ఆధారంగా చేసుకుని కొందరు ట్విట్టర్‌లో స్పందించారు. ‘సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం అన్వేశ్‌కు అర్థమైంది, కానీ కేటీఆర్‌కు అర్థం కాలేదు’ అని ఒకరు ట్వీట్ చేయగా, ‘భూ వివాదాన్ని రాజకీయం చేస్తున్న వాళ్లనే గుంటనక్కలు అన్నారు, అంటే నిన్నే (కేటీఆర్) అన్నారు’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ ట్వీట్లు రీట్వీట్‌లతో వైరల్ అవుతున్నాయి.
Also Read: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. నీటి విడుదలపై రాజకీయ రగడ.. వివాదం ఎందుకంటే?
కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. గతంలో మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. సీఎం ప్రసంగాన్ని తప్పుగా అర్థం చేసుకోవడమే కాకుండా, విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో యూనివర్సిటీ భూములు ప్రభుత్వ ఆస్తిగా ఉంటాయని చెప్పి, ఇప్పుడు ఆందోళనలకు మద్దతిచ్చే ద్వంద్వ వైఖరీ ప్రదర్శిస్తోందని వారు పేర్కొన్నారు.
సీఎం మాటలను వక్రీకరించి, విద్యార్థులను అన్నట్లుగా చిత్రీకరించడం ద్వారా యూనివర్సిటీలో ఆందోళనలు మరింత పెరిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని పలువురు ప్రజలు, కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలాంటి దిగజారుడు పనులు మానుకోవాలని ప్రజలు కోరుతున్నారు.