Siva Shakthi Datta: ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (Keeravani) ఇంట విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన తండ్రి కోడూరి శివశక్తి దత్తా (92) మణికొండలోని తన నివాసంలో సోమవారం రాత్రి కన్నుమూశారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. కోడూరి శివశక్తి దత్తా గేయ రచయిత, స్ర్కీన్ రైటర్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు. తాజాగా ఆయన ఇంటర్వ్యూకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మాధ్యమాలలో బాగా వైరల్ అవుతోంది. సినిమా ఇండస్ట్రీలో మంచి పీక్ టైమ్‌లో చేసిన పని కారణంగా, ఇండస్ట్రీలో తమ పేరు అంతగా వినబడలేదనే అభిప్రాయాన్ని ఆయన ఇందులో వ్యక్తం చేశారు. ఇంతకీ ఇండస్ట్రీలో పీక్ టైమ్‌లో ఉండగా.. ఆయన, ఆయన ఫ్యామిలీ ఏం చేశారో ఆయన మాటల్లోనే..
Also Read- HHVM: శివుడు, విష్ణువుల అవతారం ఈ ‘వీరమల్లు’.. ఆ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్!
‘‘16 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీని వదిలేసి తుంగభద్ర వెళ్లిపోయాం. అక్కడ మా నాన్నగారు సంపాదించిన భూముల్లో కొత్త రైల్వే ట్రాక్ వెళ్లింది. ఆ రైల్వే ట్రాక్ నిమిత్తం మా భూములన్ని వెళ్లిపోయాయి. మా నాన్నగారికి భూములంటే ఇష్టం. ఆయన మళ్లీ భూములకు భూములు కొనాలని తుంగభద్రకు వెళ్లారు. ఆ ప్రభావం నాపై కూడా పడింది. నేను కూడా వెళ్లి అక్కడ 300 ఎకరాలు కొన్నాను. ఇక్కడ 30 ఎకరాలు అమ్మేశాం. మేము మొత్తం నలుగురు అన్నదమ్ములం. నేను, మా తమ్ముడు రామకృష్ణ, బోసు, ప్రసాద్. ఇక్కడ అన్నీ వదిలేసి, అక్కడకి వెళ్లి భూములు కొనుక్కుని 16 సంవత్సరాలు అక్కడే ఉన్నాం. ఆ 16 సంవత్సరాలు అక్కడే ఉండటం కారణంగా ఇండస్ట్రీకి దూరమైపోయాను.
‘జానకి రాముడు’ సినిమా తర్వాతే మేమంతా వెళ్లిపోయాం. ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ ఉన్నాడు కదా. ఈ 16 సంవత్సరాల తర్వాత ఆయనకు ఒకసారి కనిపిస్తే.. నా వంక అదోలా చూసి.. ‘ఏమై పోయావయ్యా బాబు.. ఎక్కడికి వెళ్లిపోయావు. నువ్వు లేక ఆ దాసరోడికి (దాసరి నారాయణరావు), కోడిగాడికి (కోడి రామకృష్ణ), రేలంగోడికి (రేలంగి నరసింహారావు) సినిమాలిచ్చాను. ఎక్కడికి పోయావయ్యా ఇన్నాళ్లు.. అని తలబాదుకున్నాడు’. అప్పట్లో ఆయన అలాగే మాట్లాడేవారు. నాకంటే ఆయన అంత పెద్దవాడేం కాదు. నాకంటే ఓ ఐదారు సంవత్సరాలు పెద్దవాడు అంతే. అతను బువ్వ తినమన్నా తినేవాడు కాదు. ఆత్మాభిమానం బాగా ఎక్కువ. ప్రొడక్షన్ మేనేజర్‌గా చేసేవాడు. నేను కనిపెట్టి.. జేబులో ఓ 10 రూపాయలు పెట్టేవాడిని. వద్దు గురు, వద్దు గురు అని అంటుంటేవాడు. ఆ అభిమానం నాపై చాలా ఉంది.
Also Read- Kannappa: అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ‘కన్నప్ప’ స్పెషల్ షో..
అప్పట్లో సినిమాలకు కలిసి వెళ్లే వాళ్లం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా మూడు భాషల సినిమాలు చూసేవాళ్లం. అలా చూసేటప్పుడు.. అక్కడ సినిమా ప్లే అవుతుండగానే, రాబోయే సీన్ మొత్తం చెప్పేసేవాడిని. రాబోయే డైలాగ్ కూడా చెప్పేవాడిని. మనోడు కొడతాడు చూడు.. ఇప్పుడున్నవాళ్లంతా ఎగిరిపోతారు అని రాఘవ నన్ను ఉద్దేశించి అంటుండేవారు. కానీ విధి మిమ్మల్ని అటు లాక్కెళ్లిపోయింది’’ అని చెప్పుకొచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు