HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా విషయంలో రెండు రోజులుగా కాంట్రవర్సీ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను అడ్డుకుంటామని కొందరు మైకుల ముందుకు వచ్చి ఏవేవో చెబుతూ ఉన్నారు. తెలంగాణకు చెందిన ఓ వీరుడి కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారని, అతని కథను వక్రీకరించారంటూ కాంట్రవర్సీ చేస్తున్నారు. ఈ కాంట్రవర్సీపై చిత్రయూనిట్ స్పందించింది. తెలంగాణ వీరుడి కథకు, వీరమల్లు కథకు అసలు సంబంధమే లేదని వారు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ వీరుడి కథ అని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఈ చిత్రం నిజ జీవితంలోని ఏ ఒక్క నాయకుడి కథ ఆధారంగానూ తెరకెక్కలేదని, సనాతన ధర్మాన్ని పరిరక్షించే ఓ వీరుడి ప్రయాణాన్ని తెలిపే కల్పిత కథగా ఇది రూపొందించామని తెలిపారు. జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘హరి హర వీరమల్లు’ కథ పూర్తిగా మారిపోయింది. దర్శకుడు కథలోని స్ఫూర్తిని, సారాన్ని అలాగే ఉంచుతూ.. సరికొత్త కథగా దీనిని మలిచారని అన్నారు.
Also Read- Bhairavam OTT: ‘భైరవం’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామిని శివుడు-మోహినిల కుమారుడిగా.. శైవం, వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో.. అలాగే ‘హరి హర వీరమల్లు’ను శివుడు, విష్ణువుల అవతారంగా చూడబోతున్నారని తెలిపారు. సరిగ్గా గమనిస్తే.. హరి(విష్ణు), హర(శివుడు) అనే టైటిల్ ఈ చిత్ర సారాంశాన్ని తెలియజేస్తుంది. శివుడు, విష్ణువుల అవతారం ‘వీరమల్లు’ అని తెలిపేలా ఈ చిత్రంలో పలు అంశాలను గమనించవచ్చు. విష్ణువు వాహనం గరుడ పక్షిని సూచించే డేగను ఈ చిత్రంలో ఉపయోగించారు. అలాగే, హీరో తన చేతుల్లో శివుడిని సూచించే ఢమరుకం పట్టుకున్నారు. ఈ చిత్రంలో హీరో ధర్మాన్ని రక్షించడానికి, ధర్మం కోసం పోరాడటానికి శివుడు, విష్ణువుల యొక్క రూపంగా కనిపిస్తాడని పేర్కొన్నారు.
‘హరి హర వీరమల్లు’ సినిమాను ఎ. ఎం. రత్నం అత్యధిక బడ్జెట్‌తో భారీస్థాయిలో నిర్మించారు. భారీ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన రత్నం.. గతంలో కూడా ఇలా అత్యధిక బడ్జెట్‌తో నిర్మించిన చిత్రాలతో ఘన విజయాలను అందుకున్నారు. ఈ సినిమాపై కూడా ఆయన ఎంతో నమ్మకంతో ఉన్నారు. అందుకే ఓవర్సీస్, హిందీ తప్ప సినిమాకి సంబంధించిన మిగతా హక్కులను అమ్మడానికి ఎ.ఎం. రత్నం సిద్ధమవ్వలేదు. అసలే పవన్ కళ్యాణ్ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా, దానికితోడు సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ అందరినీ విశేషంగా ఆకట్టుకొని.. అంచనాలను రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఈ చిత్ర హక్కులను దక్కించుకోవడానికి తీవ్ర పోటీ నెలకొందని, ఎందరో పంపిణీదారులు ఇప్పటికే నిర్మాతను సంప్రదించారని, భారీ మొత్తాన్ని చెల్లించి, హక్కులను పొందేందుకు వారు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
Also Read- Jabardasth Nukaraju: జబర్దస్త్ నూకరాజు ఆ విషయంలో ఆసియాను బలవంతం చేశాడా?
సినిమాని భారీస్థాయిలో రూపొందిస్తే.. హక్కుల రూపంలో ఫ్యాన్సీ ధరలను పొందగలమని నిర్మాతలు నమ్మారు. అందుకే ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను అత్యంత భారీస్థాయిలో నిర్మించారు. నిర్మాతల నమ్మకం నిజమై.. చిత్ర పంపిణీ హక్కులు భారీ ధర పలుకుతున్నాయి. ప్రేక్షకులు కూడా వెండితెరపై ఈ చిత్రాన్ని చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జూలై 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు