- రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసిన స్వేచ్ఛ ‘సీడ్ బాంబ్’ కథనం
- ఫ్రస్ట్రేషన్‌లో రైతులను బెదిరిస్తున్న ఆర్గనైజర్లు
- పంట నష్టపోలేదు, ఎండిపోయాయని బాండ్‌పై రాయాలని ఒత్తిడి
- ఇంత జరిగినా అరెస్టులు కాకపోవడంపై అన్నదాతల ఆందోళన
- జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వినతి
- న్యాయం కోసం పోరాటమా? ఒత్తిడికి తలొగ్గడమా? అయోమయంలో రైతులు
- అగ్రికల్చర్ అధికారులకు కంపెనీల నుంచి భారీ ఆఫర్!
ములుగు/మహబూబాబాద్, స్వేచ్ఛ: సంచలన కథనాలకు వేదిక స్వేచ్ఛ. ఈమధ్య ఏజెన్సీలో జరుగుతున్న విత్తన దందాపై ‘సీడ్ బాంబ్’ పేరుతో కథనాన్ని ప్రచురించగా, ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల రైతులను బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల(Corn Seed Companies) ఆర్గనైజర్లు బెదిరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జరిగిందంతా బయటపడినా, ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా, తమను నట్టేట ముంచిన విత్తన కంపెనీల యాజమాన్యం, వారికి సహాయకారులుగా పని చేస్తున్న ఆర్గనైజర్లను అరెస్టు చేయకపోవడంపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పరిహారం కోసం నిరసన చేస్తున్న తమను విత్తన కంపెనీల ఆర్గనైజర్లు భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు కొందరు చెబుతున్నారు. ఇప్పటికే బాండ్ అగ్రిమెంట్ ప్రకారం ఒక్కో రైతు దాదాపు రూ.50 వేల పైగానే విత్తన కంపెనీల యాజమాన్యానికి చెల్లించాల్సి ఉంది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక, ఆర్గనైజర్లు స్పందించి నష్టపరిహారం వార్తలు ప్రసారం చేస్తున్న మీడియా మాధ్యమాలను అడుక్కోమని పొగరుగా మాట్లాడుతున్నారని రైతులు చెబుతున్నారు.
ఎండిపోయినట్టు అగ్రిమెంట్లు రాయాలని ఒత్తిడి
వివిధ బహుళ జాతి మొక్కజొన్న విత్తన కంపెనీల ఆర్గనైజర్లు రైతుల దగ్గరకు వెళ్లి కంపెనీ విత్తనాల ద్వారా తాము నష్టపోలేదని, తాము వేసుకున్న పంటలు ఎండిపోయాయని బాండ్ పేపర్‌పై అగ్రిమెంట్లు రాసి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే తాము విత్తన కంపెనీల యాజమాన్యాలకు అప్పు పడ్డామని వాటిని ఎలా తీర్చాలో తెలియకపోవడంతో అయోమయానికి గురవుతున్నట్టు రైతులు వాపోతున్నారు. మరోపక్క, జరిగిన నష్టానికి న్యాయం చేయాలని ఆందోళన బాట పట్టిన రైతులకు అడుగడుగునా ఆర్గనైజర్ల ద్వారా ఒత్తిడి వస్తున్నట్టు ఆదివాసీ రైతు సంఘాల నాయకులు అంటున్నారు. ఈ భారీ నష్టాలకు జిల్లా ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకుంటేనే తమకు న్యాయం జరుగుతుందని వేడుకుంటున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న తమను ఆదుకునేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్గనైజర్ల ద్వారా వార్నింగ్‌లు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని, వాటిని అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. తమ పంటలు నష్టపోవడానికి కారకులైన విత్తన కంపెనీ యాజమాన్యాలకు అనుకూలంగా పనిచేస్తున్న ఆర్గనైజర్లపై ప్రివెన్షన్ ఆఫ్ డిటెక్షన్ (పీడీ యాక్టు) నమోదు చేసి తమను ఆదుకోవాలని రైతులు అడుగుతున్నారు. న్యాయం కోసం పోరాడాలో, ఒత్తిడికి తలగ్గాలో తెలియని అయోమయంలో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నట్టు చెబుతున్నారు. అయితే, ఈ దందాకు సహకారం అందిస్తున్న ములుగు జిల్లా వ్యవసాయ యంత్రాంగానికి ఆర్గనైజర్లు భారీ ఆఫర్లు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.
Also Read: నేడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫైనల్?