ఏ క్షణమైనా ఏఐసీసీ నుంచి ప్రకటన!
సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ ఢిల్లీ టూర్ రద్దు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ తరఫున పోటీచేసే అభ్యర్థుల పేర్లు నేడో రేపో ఖరారు కానున్నాయి. రాష్ట్రం నుంచి వెళ్లిన ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత ఏఐసీసీ ఢిల్లీలోనే ఖరారు చేసి పీసీసీకి సమాచారం ఇవ్వనున్నది. నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం కావడంతో నలుగురు అభ్యర్థులను ఏఐసీసీ ఫైనల్ చేయనున్నది. వీలైతే ఆదివారం సాయంత్రమే ప్రకటన విడుదల చేస్తుందని లేదా సోమవారం ఉదయం వెల్లడిస్తుందని ఏఐసీసీ వర్గాల నుంచి సమాచారం. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌లను ఢిల్లీకి రావాల్సిందిగా ఏఐసీసీ తొలుత సమాచారం పంపినా శనివారం రాత్రికి మాత్రం అవసరం లేదనే మెసేజ్‌ను పాస్ చేసినట్లు ఏఐసీసీ, పీసీసీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో ఆదివారం ఢిల్లీకి వెళ్లే ఈ నలుగురి పర్యటన అర్ధంతరంగా రద్దైంది.
నలుగురు అభ్యర్థులకు వ్యక్తిగతంగా
నలుగురు అభ్యర్థులను ఖరారు చేస్తూ ఏఐసీసీ నుంచి ఆదివారం రాత్రికల్లా ప్రకటన వెలువడకపోతే అభ్యర్థులకు మాత్రం వ్యక్తిగతంగా సమాచారం పంపుతుందని, నామినేషన్లు దాఖలు చేసుకోడానికి అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నం కావాల్సిందిగా సూచిస్తుందని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. పీసీసీ నుంచి గత వారమే ఒక్కో స్థానానికి ముగ్గురి పేర్లను ప్రతిపాదిస్తూ లేఖ ఏఐసీసీకి వెళ్ళింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కేటగిరీల్లో పేర్లు వెళ్ళాయి. వీరిలో ఎవరి పేర్లు ఖరారవుతాయనే ఆసక్తి నెలకొన్నది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ సహా కీలక నేతలు ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉండగా ఆదివారం మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకుంటారని, సాయంత్రం కల్లా తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించి ఒక నిర్ణయానికి వస్తారని తెలిసింది. ఆ సమయానికి తెలంగాణ నుంచి పై నలుగురూ అక్కడ అందుబాటులో ఉండేలా తొలుత షెడ్యూలును రూపొందించుకున్నా చివరి నిమిషంలో ఢిల్లీకి రానవసరం లేదనే సమాచారాన్ని పంపినట్లు తెలిసింది.
Also Read: కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసి తీరుతాం: సీఎం రేవంత్ రెడ్డి