IPL Star Retirement: టీ20 ప్రపంచ కప్-2007, వన్డే ప్రపంచ కప్-2011 గెలిచిన భారత జట్లలో సభ్యుడిగా ఉన్న టీమిండియా లెగ్-స్పిన్నర్ పియూష్ చావ్లా (Piyush Chawla Retirement) క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియా తరపున చావ్లా రెండు టెస్టు మ్యాచ్‌లు, 7 టీ20 మ్యాచ్‌లు, 25 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి భారత్ తరపున 43 వికెట్లు పడగొట్టాడు. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (IPL) మొత్తం 192 మ్యాచ్‌లు ఆడిన చావ్లా, ఏకంగా 192 వికెట్లు తీశాడు. 2014లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్ కూడా పియూష్ చావ్లా కావడం విశేషం. ఐపీఎల్‌లో గతేడాది ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు.
Read this- PM Narendra Modi: పాకిస్థాన్ టార్గెట్ అదే.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
వీడ్కోలు సమయం వచ్చింది
తన రిటైర్మెంట్‌పై పీయూష్ చావ్లా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ పోస్ట్ విడుదల చేశాడు. రెండు దశాబ్దాలకు పైగా మైదానంలో ఉన్నానని, అద్భుతమైన ఆటకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైందంటూ చావ్లా రాసుకొచ్చాడు. క్రీజు నుంచి తాను దూరంగా వెళ్లినా, క్రికెట్ ఎల్లప్పుడూ తనలో ఉంటుందని అన్నాడు. క్రికెట్ స్ఫూర్తి, మైదానంలో నేర్చుకున్న పాఠాలను తనతో తీసుకెళ్లి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నట్టు చావ్లా చెప్పాడు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌తో పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇవాళ తనకు చాలా భావోద్వేగమైన రోజు అని వ్యాఖ్యానించారు.
‘‘భారతదేశానికి అత్యున్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం నుంచి, 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్ విజేత జట్లలో భాగస్వామి కావడం వరకు, ఈ అద్భుతమైన క్రికెట్ జర్నీలో ప్రతి క్షణం ఒక వరం కంటే తక్కువేమీ కాదు. ఈ జ్ఞాపకాలన్నీ ఎల్లప్పటికీ హృదయంలో నిలిచి ఉంటాయి’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పీయూష్ చావ్లా చెప్పుకొచ్చాడు. తన క్రికెట్ కెరీర్‌ను మలచడంలో కీలకపాత్ర పోషించిన తన కోచ్‌లు, జట్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలు అన్నింటికీ కృతజ్ఞతలు తెలిపాడు.
Read this- RBI Rate Cut: ఈఎంఐ చెల్లింపుదారులకు ఆర్బీఐ అదిరిపోయే గుడ్‌న్యూస్
ఐపీఎల్ నాకెంతో ప్రత్యేకం
ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ ఉన్న ఐపీఎల్ టీ20 లీగ్‌లో తన కెరీర్‌లో ఒక ప్రత్యేక అధ్యాయమని చావ్లా అభివర్ణించాడు. తనపై నమ్మకం ఉంచిన ఐపీఎల్ ఫ్రాంచైజీలైన పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని అన్నాడు. ‘‘ఐపీఎల్ నా కెరీర్‌లో నిజంగా ప్రత్యేకమైన అధ్యాయం. మెగా లీగ్‌లో ఆడుతున్న ప్రతి క్షణాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తున్నాను. నా కోచ్‌లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కోచ్‌లు కేకే.గౌతమ్, దివంగత పంకజ్ సరస్వత్ నన్ను ఒక క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు కృషిచేశారు’’ అని చావ్లా వ్యాఖ్యానించాడు. రిటైర్మెంట్ సందర్భంగా తన తండ్రిని గుర్తుచేసుకుంటున్నానని, తనపై నమ్మకంతో ఆయన ముందుకు నడిపించారని చెప్పాడు. నాన్న లేకుండా ఈ ప్రయాణం ఎప్పటికీ సాధ్యం కాదని కొనియాడాడు.
కాగా, పీయూష్ చావ్లా 15 ఏళ్ల వయసులోనే క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇండియా అండర్-19, ఉత్తరప్రదేశ్ అండర్-22 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2005-06లో జరిగిన ఛాలెంజర్ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్‌ను గూగ్లీతో ఔట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. దీంతో,17 ఏళ్ల వయసులో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 1,000కి పైగా వికెట్లు పడగొట్టాడు.