PM Narendra Modi: ఉగ్రవాదానికి పుట్టినిల్లు లాంటి దాయాది దేశం పాకిస్థాన్‌పై (Pakistan) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) ఆర్థిక వ్యవస్థపై దాడి, పర్యాటకులను భయభ్రాంతులకు గురిచేసేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నిందని, పహల్గామ్ ఉగ్రదాడిలో (Pahalgham Attack) 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకోవడం వెనుక లక్ష్యం ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. మానవత్వానికి, పర్యాటక రంగానికి, కాశ్మీరీలు పొట్టనింపుకునేందుకు పాకిస్థాన్ వ్యతిరేకమని, అందుకే పహల్గామ్‌లో పర్యాటకులపై దాడికి తెగబడిందని దునుమాడారు. కాశ్మీర్ లోయలో పర్యాటక రంగాన్ని దెబ్బతీసి, అల్లర్లు సృష్టించాలనుకుందని చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కాశ్మీర్ ప్రజలను ఆయన కొనియాడారు.
జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై (Cheenab Rail Bridge) ప్రపంచంలోనే ఎత్తైన రైలు బ్రిడ్జి, దేశంలో మొట్టమొదటి కేబుల్ బ్రిడ్జి ‘అంజి’ (Anji Bridge) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాననరేంద్ర మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు కాట్రాలో ఆయన మాట్లాడారు. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరు విన్నప్పుడల్లా, పాకిస్థాన్‌కు అవమానకరమైన ఓటమి గుర్తుకొస్తుందని మోదీ చురకలంటించారు. పాక్ సైనిక స్థావరాలు, రాడార్ ప్రదేశాలపై భారతదేశం ఖచ్చితత్వంతో లక్షిత దాడులు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పీవోకేతో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఖచ్చితమైన క్రూయిజ్ క్షిపణి దాడులు చేశామన్నారు.
Read this- RBI Rate Cut: ఈఎంఐ చెల్లింపుదారులకు ఆర్బీఐ అదిరిపోయే గుడ్‌న్యూస్
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి
కాగా, ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ (శుక్రవారం) తొలిసారి జమ్మూ కశ్మీర్‌లో పర్యటించారు. చీనాబ్ రైల్ బ్రిడ్జితో పాటు కాట్రా, శ్రీనగర్ మధ్య వందే భారత్ రైలుని కూడా జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఎం ఒమర్ అబ్దుల్లాతో పాటు పలువురు రాజకీయ నేతలు, అధికారులు పాల్గొన్నారు. వందే భారత్ రైలుని ప్రారంభించడం ద్వారా కాశ్మీర్ లోయ, జమ్మూ ప్రాంతం మధ్య తొలిసారి రైలుని అనుసంధానించినట్టు అయింది.
బ్రిడ్జిల ప్రత్యేకతలు ఇవే
కాట్రా, శ్రీనగర్ మధ్య అందుబాటులోకి వచ్చిన ఈ వందేభారత్ రైలులో రెండు ఫ్యాసింజర్ క్లాస్‌లు ఉంటాయి. చైర్ కార్ (CC) టికెట్ రేటు రూ.715, ఎగ్జిక్యూటివ్ క్లాస్ (EC) టిక్కెట్ రేటు రూ.1,320గా ఉంది. ఈ రైలు ప్రయాణించే మార్గంలో భారతదేశంలోనే రెండవ పొడవైన సొరంగం ‘టీ-80 ’ ఉంది. ఇది మొత్తం 11.22 కి.మీల పొడవు ఉంటుంది. ఈ సోరంగాన్ని ‘పిర్ పంజాల్ రైల్వే టన్నెల్’ అని కూడా పిలుస్తారు. బనిహాల్, ఖాజిగుండ్‌ల మధ్య ఈ సొరంగం ఉంది. కాట్రా, శ్రీనగర్ మధ్య నిర్మించిన రైలు ప్రాజెక్టు మొత్తం 119.6 కి.మీ పొడవు ఉండగా, అందులో 36 ప్రధాన సొరంగాలు, 66.4 కి.మీ పొడవున 8 ఎస్కేప్ టన్నెల్స్‌ను రైల్వే ఇంజనీర్లు నిర్మించారు.
Read this- Etela Rajender: కేసీఆర్ చెప్పినట్లే చేశా.. కాళేశ్వరంలో నా ప్రమేయం లేదు.. ఈటల
ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన చీనాబ్ రైలు బ్రిడ్జి పొడవు 1.3 కి.మీగా ఉంది. దీని ఎత్తు ఏకంగా 359 మీటర్లు. ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తు ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణంలో ఏకంగా 600 కి.మీ కంటే ఎక్కువ ‘స్టీల్ వెల్డింగ్’ను ఉపయోగించారు. జమ్మూ నుంచి ఢిల్లీ వరకు ఉన్న రైల్వే ట్రాక్ పొడవును ఈ దూరం మించిపోయింది. ఇక, దేశంలో తొలి కేబుల్ రైల్వే బ్రిడ్జి అయిన ‘అంజి’ వంతెన పొడవు 725.5 మీటర్లు ఉంది.