Peddapalli Crime: తెలంగాణలో మరో పరువు హత్య చోటుచేసుకుంది. కూతుర్ని ప్రేమించాడన్న కారణంతో కుమార్తె తల్లి – తండ్రి నరరూప రాక్షసులుగా మారారు. కుమార్తెను ప్రేమిస్తున్న యువకుడ్ని అత్యంత దారుణంగా నరికి చంపారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రేమించిన పాపానికి తన బిడ్డను చంపేస్తారా అంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రేమ వ్యవహారం
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరి తోట గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాయి కుమార్ గౌడ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మరో యువతితో కొద్దిరోజుల నుండి ప్రేమ వ్యవహారాన్ని కొనసాగిస్తున్నాడు. మృతుడు సాయికుమార్ గ్రామంలో జులాయిగా తిరుగుతూ అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడని గ్రామస్తులు చెబుతున్నారు.
కుమార్తెను హెచ్చరించిన తండ్రి
సాయికుమార్ కు దూరంగా ఉండాలంటూ యువతి తండ్రి సదయ్య (Sadayya) కుమార్తెను పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. దీంతో కూతురిపై కోపం సాయికుమార్ పై కక్ష్యగా మారింది. సాయికుమార్ బర్త్ డే సందర్భంగా యువతి హాస్టల్ నుండి గ్రామానికి చేరుకొని వేడుకలకు సిద్ధం కావడం సదయ్యకు మరింత కోపం తెప్పించింది. దీంతో సదయ్య తన భార్యతో కలిసి సాయికుమార్ ను గొడ్డలితో నరికి చంపాడు.
ఏసీపీ ఏమన్నారంటే
సాయికుమార్ దారుణ హత్యపై పెద్దపల్లి జిల్లా ఎసీపీ కరుణాకర్ (ACP Karunakar) స్పందించారు. గురువారం రాత్రి సాయికుమార్ హత్య జరిగినట్లు స్పష్టం చేశారు. ఫ్రెండ్స్ తో సాయికుమార్ పుట్టిన రోజు వేడకలు జరుపుకున్న తర్వాత సదయ్య, అతని భార్య యువకుడ్ని గొడ్డలితో నరికి చంపినట్లు తెలిపారు. క్లూస్ టీమ్ ద్వారా సాక్ష్యాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. గతంలో సాయికుమార్ ప్రేమ వ్యవహారంపై పంచాయతీ జరిగినట్లు ఏసీపీ తెలిపారు. ఆ సందర్భంగా తన కుమార్తె జోలికి రావొద్దని హెచ్చరించారని పేర్కొన్నారు. అయితే పోలీసులను మాత్రం ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఏసీపీ స్పష్టం చేశారు.
Als0 Read: Bengaluru Crime: అత్యంత కిరాతకం.. భార్యను ముక్కలుగా నరికిన భర్త.. ఆపై సూట్ కేస్ లో
బాధిత కుటుంబంలో విషాదం
సాయికుమార్ దారుణ హత్య ఉదంతంతో ముప్పిరి తోట గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుతం గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సాయికుమార్ మృతిపట్ల గ్రామస్తులు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరోవైపు సాయికుమార్ ఫ్యామిలీ తీవ్ర మనోవేదనలో కూరుకుపోయింది. తమ బిడ్డ చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సాయికుమార్ కుటుంబ, బంధువులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
మిర్యాలగూడ ఘటన గుర్తుందా?
2018లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ కుమార్ (Pranay Murder Case) హత్యోదంతం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తనకు ఇష్టంలేకుండా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతో కుమార్తె అమృత కళ్లముందే ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించాడు తండ్రి మారుతీరావు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఈ కేసుకు సంబంధించి నిందితులకు న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఒకరికి ఉరిశిక్ష పడగా.. ఆరుగురికి జీవిత ఖైదు విధించారు.