Bengaluru Crime: భార్య భర్తలు అంటే ప్రేమానురాగాలకు కేరాఫ్ గా చెబుతుంటారు. ఎంతటి కష్టంలోనైనా ఒకరికొకరు తోడు నీడగా దంపతులు జీవిస్తుంటారు. అయితే కొందరు కపుల్స్ ఈ అభిప్రాయాలకు తూట్లు పొడుస్తున్నారు. జీవితాంతం అండగా నిలవాల్సిన భాగస్వామిని అతి దారుణంగా చంపేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయి. తాజాగా బెంగళూరులోనూ ఇలాంటి దారుణమే చోటుచేసుకుంది. ఓ వ్యక్తి భార్యను ముక్కలు ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
ముక్కలుగా నరికి..
కర్ణాటక రాజధాని బెంగళూరులో అత్యంత దారుణ ఘటన (Bengaluru Crime) చోటుచేసుకుంది. నగర శివారైన హులిమావు ప్రాంతానికి చెందిన రాకేష్ (Rakesh) అనే వ్యక్తి తన భార్య గౌరీ అనిల్ సాంబెకర్ (32) అతి కిరాతకంగా గొంతు కోసి చంపాడు. ఆపై ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి సూట్ కేసులో దాచాడు. ఆపై బాధితురాలి తల్లితండ్రులకు రాకేష్ విషయం తెలియజేయడంతో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
ఎందుకు చంపాడంటే?
మహారాష్ట్ర చెందిన రాకేష్ (Rakesh), గౌరీ అనిల్ సాంబేకర్ (Gouri Anil Sambekar).. ఉద్యోగరిత్యా బెంగళూరులో నివసిస్తున్నారు. రాకేష్ ఓ ప్రైవేటు కంపెనీలో వర్క్ ఫ్రమ్ చేస్తున్నాడు. భార్య గౌరి మాస్ కమ్యూనికేషన్ చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటోంది. అయితే రాకేష్ గౌరీ మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో రాకేష్ పై గౌరీ పలుమార్లు చేయి కూడా చేసుకున్నట్లు ఆరోపిస్తున్నారు. తాజాగా వీరి మధ్య మరోమారు వాగ్వాదం జరగ్గా.. రాకేష్ కోపం కట్టలు తెంచుకుంది. దీంతో ఆమెను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
దర్యాప్తు ముమ్మరం
మహారాష్ట్రకు చెందిన గౌరీ తల్లిదండ్రులకు హత్య గురించి రాకేష్ చెప్పడంతో స్థానిక పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. దీంతో మహారాష్ట్ర పోలీసుల ఇచ్చిన సమాచారం మేరకు బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగారు. డీసీపీ సారా ఫాతిమా ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. అయితే భార్యపై అనుమానంతోనే రాకేష్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
కాపురాలు కుదేలు
భార్య భర్తల సంబంధం నానాటికి బలహీనపడుతున్నట్లు వరుసుగా జరుగుతున్నట్లు బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా అక్రమ సంబంధాల కారణంగా భార్య భర్తలు విజ్ఞతను కోల్పోతున్నారు. జీవిత భాగస్వామిని కడతేర్చేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. గతంలో హైదరాబాద్ మీర్ పేట్ లో జరిగిన హత్యోదంతం కూడా తాజా బెంగళూరు ఘటన తరహాలోనిదే. ప్రస్తుతం భర్తను భార్య.. భార్యను భర్త చంపిన ఘటనలు సమాజంలో ఎక్కువ అవుతుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. దంపతులు క్షణికావేశంలో చేసిన చర్యలు వారి పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. తల్లిదండ్రుల్లో ఒకరు శాశ్వతంగా దూరమై.. మరొకరు జైలు వెళ్తుండంతో వారి పిల్లల జీవితాలు అగమ్య గోచరంగా మారిపోతున్నాయి.