Minister Seethakka: కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు గుర్తింపు కోసం కాంగ్రెస్‌ను తిట్టడమే మార్గమన్న ఆలోచన ఉందని రాష్ట్ర మంత్రి సీతక్క ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం పథకం కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తోందన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఆదివారం సాయంత్రం హుజూర్ నగర్‌లో జరగనున్న సన్న బియ్యం ప్రారంభోత్సవ సభకు వెళ్తూ.. సూర్యాపేటలో పటేల్ రమేశ్ రెడ్డి నివాసంలో కొద్దిసేపు ఆగిన సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బండి సంజయ్ వ్యాఖ్యలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు కీలక విషయాలను ప్రస్తావించారు.
సీతక్క మాట్లాడుతూ.. బండి సంజయ్‌కు గుర్తింపు సమస్య ఉందన్నారు. కాంగ్రెస్‌ను తిడితేనే గుర్తింపు వస్తుందని ఆయన ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. 2013లో ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అలాగే, ఉపాధి హామీ చట్టాన్ని కూడా కాంగ్రెస్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కానీ దాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. తెలంగాణలో ‘కాంగ్రెస్ కరప్షన్ వైరస్’ సోకిందన్న బండి సంజయ్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు.
Also Read: ఇందిరమ్మ రాజ్యంలో.. ప్రతిరోజూ పండగే…!
బీజేపీ అధికారంలోకి వచ్చిన 12 సంవత్సరాల్లో సన్న బియ్యం ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదో బండి సంజయ్ చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదో సమాధానం చెప్పాలని ఆమె సవాల్ విసిరారు. తెలంగాణలో నరేంద్ర మోడీ ఫొటో పెట్టాలన్న బండి సంజయ్ వాదనపై కూడా ఆమె ప్రశ్నలు సంధించారు. పదేళ్లుగా బీజేపీకి అధికారం ఇస్తే గ్రామాల్లోకి అక్షింతలు వచ్చాయి తప్ప అభివృద్ధి రాలేదని విమర్శించారు. ఈ పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవడానికి లేక, మతం పేరుతో, దేవుడి పేరుతో ప్రజల మధ్య ఐక్యతను చెడగొట్టాలని చూస్తోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.
కరప్షన్‌కు బ్రాండ్ అంబాసిడర్ బీజేపీ ప్రభుత్వమే అని మంత్రి సీతక్క అన్నారు. ప్రధాని, అంబానీలకు పేదల సంపదను దోచిపెట్టి బీజేపీ నాయకులు వాటాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు తినడానికి లేని రోజుల నుంచి ఈ రోజు సన్న బియ్యం ఇచ్చే వరకు అభివృద్ధి చేసిందని ఆమె గుర్తు చేశారు.
Also Read: హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. ఇకపై మెట్రో సేవలు మరింతగా..
కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై సీతక్క స్పష్టం చేస్తూ.. రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో కేంద్రానికి ఒక రూపాయి పంపిస్తే, తిరిగి 48 పైసలే వస్తున్నాయని పేర్కొన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం పథకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటోలు పెడతారా? అని తిరిగి ప్రశ్నించారు.