ఖమ్మం స్వేచ్ఛ: Ponguleti Srinivasa Reddy: తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతిరోజూ పండగ రోజే అని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.
గడిచిన 15 నెలల కాలంలో ఇందిరమ్మ ప్రభుత్వం చేసిన పాలనపై తెలంగాణ ప్రజలందరూ సంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందని తెలిపారు. మహిళల కోసం ఆర్టీసీ ఉచిత బస్సు, 500 రూపాయలకే గ్యాస్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు.
Also Read: BRS Rajatotsava Sabha: రజతోత్సవ సభపైనే గులాబీ ఫోకస్.. ప్లాన్స్ ఫలించేనా?
రైతులకు రుణమాఫీ, రైతు బంధుతో పాటు సన్నాలకు బోనస్ కల్పించిన ఘనత తమదేనన్నారు. ఇళ్లు లేని పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్లను విడతల వారీగా మంజూరు చేస్తూ వస్తున్నామని దీనిపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
తాజాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువకుల ఉపాధి కోసం రాజీవ్ యువవికాస్ పేరుతో 50వేల నుంచి 4లక్షల రుణం ఇచ్చే పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లోని సుమారు 5లక్షల మందికి పైగా యువతకు ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు.
ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ‘శ్రీ విశ్వావసు నామ’ సంవత్సరంలోనూ ఇదే రకమైన పాలనను కొనసాగిస్తూ తెలంగాణ ప్రజలకు మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దరిచేరుస్తామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
Also Read: Telangana Farmers: తెలంగాణ రైతులకు రాజస్థాన్ లో శిక్షణ.. వీటిపైనే..